
ఢిల్లీ అసెంబ్లీ రద్దుపై త్వరగా తేల్చండి
కేంద్రానికి ఐదు వారాల గడువిచ్చిన సుప్రీంకోర్టు
ఖాళీగా ఉంటున్న ఎమ్మెల్యేలకు జీతాలెందుకివ్వాలని ప్రశ్న
ఎన్నికలు నిర్వహించాలన్న ఆప్ వ్యాజ్యంపై విచారణ వాయిదా
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని ఐదు వారాల్లోగా పరిష్కరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆలోగా అసెంబ్లీ రద్దు విషయమై తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గద్దె దిగిన తర్వాత రాష్ర్టంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో ఢిల్లీ అసెంబ్లీని ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉంచిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రాష్ర్టపతి పాలన రాజ్యాంగ విరుద్ధమని, అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆప్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. ‘తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలచుకోవడం లేదని ఒక పార్టీ అంటోంది. తమకు చేతకాదని మరో పార్టీ అంటోంది. మూడో పార్టీకి బలం లేదు. ఈ పరిస్థితిలో ప్రజలెందుకు ఇబ్బందులు పడాలి?’ అని జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అసెంబ్లీ సుప్తచేతనంగా ఉన్నందున ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుంటున్న ఎమ్మెల్యేలకు ప్రజాధనాన్ని జీతంగా ఎందుకు చెల్లించాలని కూడా ఘాటుగా ప్రశ్నించింది. ఈ వ్యాజ్యాన్ని పార్టీ కోణంలో కాకుండా సగటు ఢిల్లీ వాసి దృష్టితో చూస్తున్నట్లు పేర్కొంది. కోర్టు అభిప్రాయాన్ని కేంద్రానికి తెలపాలని అదనపు సొలిసిటర్ జనరల్ పీఎల్ నరసింహను కోరింది. గత ఐదు నెలల్లో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టిందని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజలిచ్చిన తీర్పు ఆరు నెలల్లోనే వృథా కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం తెలిపినప్పటికీ కోర్టు సంతృప్తి చెందలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం లేదంటోందని, మరోపక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు తగిన బలం లేదని ఆప్ చెబుతోందని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో ఎంతకాలం అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచుతారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఢిల్లీ అసెంబ్లీ విషయంలో ఐదు వారాల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
సుప్రీం వ్యాఖ్యలపై ఆప్ హర్షం వ్యక్తం చేసింది. కోర్టు అభిప్రాయంతో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఏకీభవించారు. అనిశ్చితిని తొలగించవలసిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వీలుకాకపోతే ఎన్నికలు జరిపించక తప్పదని వ్యాఖ్యానించారు. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీ బలం ముగ్గురు బీజేపీ సభ్యుల రాజీనామాతో 67కు చేరింది. బీజేపీకి ప్రస్తుతం మిత్రపక్షమై అకాలీదళ్ ఎమ్మెల్యే ఒకరితోపాటు 28 మంది సభ్యులున్నారు. ఎన్నికల్లో 28 సీట్లు గెల్చుకుని ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ బలం ఒక స్వపక్ష సభ్యుడి బహిష్కరణతో 27కు పరిమితమైంది.