
న్యూఢిల్లీ : నిర్భయ కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. అక్షయ్ పిటిషన్‌పై డిసెంబర్ 17న మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తనకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని అక్షయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం, జల కాలుష్యం వల్ల ఎలాగో తన ఆయుష్షు తగ్గిపోతుందని.. అలాంటప్పుడు మరణశిక్ష ఎందుకు అని ప్రశ్నించాడు.
అయితే గతంలో మిగిలిన ముగ్గురు దోషులు వినయ్, ముకేశ్, పవన్‌లు దాఖలు చేసిన పిటిషన్‌లను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇటీవల వినయ్ క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వంతోపాటు, కేంద్రం కూడా తోసిపుచ్చింది. కొద్ది రోజుల్లో నిర్భయ కేసులో దోషులను ఊరి తీస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్న సమయంలో అక్షయ్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, నిర్భయను 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి బస్సులో ఆరుగురు రాక్షసులు మూకుమ్మడిగా అత్యాచారం చేయడమే కాకుండా, దారుణంగా హింసించడంతో ఆమె కొన్నాళ్లు మృత్యువుతో పోరాడి సింగపూర్ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆరుగురు దోషుల్లో ఒకరైన రామ్‌సింగ్ జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ కావడంతో మూడేళ్ల పాటు జువైనల్ హోంకి పంపారు. మిగిలిన నలుగురికి కోర్టు 2017లో మరణశిక్ష విధించింది. ప్రస్తుతం వీరు తీహార్ జైలులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment