సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణను ఈ నెల 18కి కోర్టు వాయిదా వేసింది. నిందితుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటిషన్ ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది. మరోవైపు నిర్భయ కేసులోని నిందితులకు శిక్ష అమలుచేయడంలో ఆలస్యం పై ఆమె తల్లి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్షయ్ రివ్యూ పిటీషన్‌లో ప్రతివాదిగా చేర్చాలని అనుమతి కోరారు. దీనికి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డె అనుమతి ఇచ్చారు. ఈ నెల 17న పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ సందర్భంగా నిర్భయ తల్లి మాట్లాడుతూ.. ‘నిందితులను కోర్టు ఉరి శిక్ష వేసి వేసి రెండున్నరేళ్లు అవుతుంది. వారి రివ్యూ పిటిషన్లను తిరస్కరించి ఇప్పటికి 18నెలల దాటిపోయాయి. అయినప్పటికీ వారిని ఉరి తీయలేదు. నిందితులను వెంటనే ఉరి తీయాలని ప్రభుత్వాన్ని, కోర్టును కోరుతున్నాను’ అని అన్నారు.
అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ముందే తిరస్కరించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తమకు వేరే మార్గం లేదని. కోర్టు నిర్ణయాన్ని గౌరవించి ఈ నెల 17వరకు వేచి చూడాల్సిందేనని తెలిపారు. ఏడేళ్ల నుంచి నిరీక్షిస్తునే ఉన్నామని, మరో వారం రోజులు వేచి చూడగలమని చెప్పారు. అయితే గతంలో మిగిలిన ముగ్గురు దోషులు వినయ్, ముకేశ్, పవన్‌లు దాఖలు చేసిన పిటిషన్‌లను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇటీవల వినయ్ క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వంతోపాటు, కేంద్రం కూడా తోసిపుచ్చింది.
కాగా, నిర్భయను 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి బస్సులో ఆరుగురు రాక్షసులు మూకుమ్మడిగా అత్యాచారం చేయడమే కాకుండా, దారుణంగా హింసించడంతో ఆమె కొన్నాళ్లు మృత్యువుతో పోరాడి సింగపూర్ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆరుగురు దోషుల్లో ఒకరైన రామ్‌సింగ్ జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ కావడంతో మూడేళ్ల పాటు జువైనల్ హోంకి పంపారు. మిగిలిన నలుగురికి కోర్టు 2017లో మరణశిక్ష విధించింది. ప్రస్తుతం వీరు తీహార్ జైలులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment