కొలీజియంలో మార్పులొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకాల కోసం నూతన వ్యవస్థ అవసరం లేదని గతంలోనే తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు.. మరోసారి కొలీజియం విధానాన్ని పరిపూర్ణంగా సమర్థించింది. ప్రస్తుతం అమలవుతున్న కొలీజయం వ్యవస్థ లోపభూయిష్టంగా మారిందని, దానిలో మార్పుచేర్పులు అవసరమన్న కేంద్ర ప్రభుత్వం సూచనలను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తిరస్కరించింది. ఈ మేరకు మంగళవారం తన అభిప్రాయాన్ని వెలువరించిన కోర్టు.. కొలీజియం వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.
గడిచిన 23 ఏళ్లుగా కొనసాగుతున్న కొలీజియం వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్జేఏసీ) వివాదాస్పదంగా మారడం, ఎన్జేఏసీపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఆ విధానం రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. తీర్పు సమయంలో కొలీజియం వ్యవస్థలో మార్పులకు సూత్రప్రాయంగా అగీకారం తెలిపినట్లు కనిపించినప్పటికీ, కేంద్రం పంపిన సూచనలేవీ సకారాత్మకంగా లేకపోవడంతో వాటిని సుప్రీం తిరస్కరించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.