
'కీర్తి ఆజాద్ పై చర్యలు తీసుకోండి'
పట్నా:డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అక్రమాల వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విమర్శించిన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ పై చర్యలు తీసుకోవాలని పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ డిమాండ్ చేశారు. పార్టీ నియమావళిని తుంగలో తొక్కాలని ప్రయత్నిచిస్తే చర్యలు తప్పవని సుశీల్ కుమార్ హెచ్చరించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఆజాద్ పై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు సుశీల్ వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజుల నుంచి జైట్లీని ఆజాద్ విమర్శిస్తున్నా.. ఇప్పటివరకూ బీజేపీ నేతలెవరూ నోరు మెదపలేదు. కాగా, తొలిసారి ఆజాద్ పై క్రమ శిక్షణా చర్యలు చేపట్టాలని సుశీల్ కుమార్ మోదీ డిమాండ్ చేయడం గమనార్హం.
కొన్ని రోజుల నుంచి డీడీసీఏ వ్యవహారంపై జైట్లీని టార్గెట్ చేస్తూ కీర్తి ఆజాద్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నసంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేసిన అనంతరం జైట్లీపై ఆజాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే తనపై దావా వేయాలని జైట్లీకి ఛాలెంజ్ చేశారు. హాల్లో డియర్ అరుణ్‌జైట్లీ.. నాపై కూడా పరువునష్టం దావా వేస్తున్నావు కదా? ప్లీజ్ నా మీద కూడా వేయ్. మినహాయింపు ఏమీ వద్దు. భావప్రకటనా స్వేచ్ఛను హరించకు' అని ట్వీట్ చేశారు. 'నా పేరు ఎందుకు కేసులో చేర్చలేదు. మీరే కదా నేను రిజిస్టర్ పోస్టులో పంపించిన లేఖలు చూపించింది'అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆజాద్ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించే అవకాశాలు కనబడుతున్నాయి.