
సాక్షి, చెన్నై: కలలు కనండి.. దానిని సాకారం చేసుకోండి అని దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇచ్చిన సందేశానికి తమిళుల నుంచి ఇటీవల విశేష స్పందన వస్తోంది. తమిళ విద్యార్థులు అనేక మంది పరిశోధనపరంగా ప్రతి ఏటా తమ ప్రతిభను చాటుకునే దిశగా ఉరకలు తీస్తున్నారు. ఎవరో ఒకరు అమెరికాలోని నాసా సందర్శనకు ఎంపిక, అక్కడ జరిగే సదస్సుకు హాజరవుతున్నారు. తొలుత కరూర్ జిల్లా పల్లం పట్టికి చెందిన రిఫాత్ షారూక్‌ను స్పెస్ కిడ్జ్ సహకారంతో పర్యావరణ, వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే రీతిలో అతి తక్కువ బరువుతో ఓ శాటిలైట్ రూపొందించి నాసా క్యూబ్స్ ఇన్ స్పెస్ పోటీల్లో తమిళుడిగా, భారత దేశ ఖ్యాతిని చాటారు. ఆతదుపరి మదురైకు చెందిన మహాత్మాగాంధీ మాంటిస్సోరి మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థి జెధాన్య తస్నిమ్ అమెరికాలోని నాసా సందర్శనకు ఎంపికయ్యారు. తాజాగా నామక్కల్‌కు చెందిన అభినయ ఎంపిక కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
సీఎం రూ.2 లక్షల సాయం
ఆరో తరగతి నుంచి ప్లస్‌టూ వరకు చదవుతున్న విద్యార్థుల్లోని స్పేస్ పరిశోధనా ప్రతిభను వెలికి తీసే రీతిలో ఇటీవల ఓ సంస్థ పరీక్షలు నిర్వహించింది. ఇందులో నామక్కల్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదవుతున్న విద్యార్థిని అభినయ తన ప్రతిభను చాటుకుంది. ఆ బాలిక నాసా పర్యటనకు ఎంపికైంది. నాసా సందర్శనతో పాటుగా అక్కడ జరిగే అంతరిక్ష పరిశోధన మహానాడులో అభినయ ప్రత్యేక ప్రసంగం ఇవ్వనుంది. ఈ సమాచారంతో సీఎం పళనిస్వామి ఆనందం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినయకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మరిన్ని రికార్డులు సృష్టించాలని, పరిశోధనాపరంగా తమిళనాడు ఖ్యాతిని చాటాలని సూచించారు. అభినయను ప్రోత్సహిస్తూ రూ.2 లక్షల సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆమెకు అందించాలని ఆదివారం అధికారుల్ని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment