తనపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసులో పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెహల్కా మేగజైన్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ చెప్పారు.
తనపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసులో పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెహల్కా మేగజైన్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ చెప్పారు. వాస్తవాలను పోలీసులకు తెలియజేస్తానని తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి నివేదిక పంపాల్సిందిగా కేంద్ర హోం శాఖ గోవా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
తన వద్ద పనిచేసే మహిళా జర్నలిస్ట్ను తేజ్పాల్ లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై జాతీయ మహిళా కమిషన్ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని శుక్రవారం ఆదేశించింది. కేసును సుమెటోగా స్వీకరించాలని సూచించింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ...ఈరోజు ఉదయం బాధితురాలిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. గోవా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఘటనపై విచారణ ప్రారంభించి వివరాలు సేకరించారు.
గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్‌లో పది రోజుల కిందట తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సంస్థలోని మహిళా జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు దుమారం రేపిన విషయం తెలిసిందే. హోటల్‌లోని ఓ లిఫ్టులోకి లాగి తేజ్‌పాల్ తనను వేధించారంటూ బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఎడిటర్ పదవికి ఆరునెలలపాటు దూరంగా ఉండనున్నట్లు తేజ్‌పాల్ బుధవారం షోమాకు పంపిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.