వేధింపుల్లో ఘనులు! | TDP mlas in first over womens Harrassment says ADR | Sakshi
Sakshi News home page

వేధింపుల్లో ఘనులు!

Published Fri, Sep 1 2017 2:18 AM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM

వేధింపుల్లో ఘనులు!

వేధింపుల్లో ఘనులు!

మహిళలపై వేధింపుల కేసుల్లో ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు
♦ దేశవ్యాప్తంగా నాలుగో స్థానం.. ఏడీఆర్‌ స్వచ్ఛంద సంస్థ నివేదికలో వెల్లడి
♦ అత్యాచార యత్నం కేసులో ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ
♦ మహిళలపై వేధింపుల్లో ఏపీ మంత్రులు దేవినేని, అచ్చెన్నాయుడు..
♦ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కూడా..
♦ ఈ జాబితాలో బీజేపీ టాప్‌.. టీడీపీ తర్వాతి స్థానంలో కాంగ్రెస్‌  


సాక్షి, హైదరాబాద్‌: మహిళలపై వేధింపుల కేసుల్లో తెలుగుదేశం పార్టీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులు, అత్యాచారయత్నం కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లుగా, మరో ఎమ్మెల్యే అత్యాచార యత్నం చేసినట్లుగా కేసులున్నాయని ఢిల్లీకి చెందిన ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలు, ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించి.. వారిలో మహిళలపై వేధింపులు, అత్యాచారయత్నం కేసులున్న వారి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఆ జాబితాలో పార్టీల వారీగా తెలుగుదేశం పార్టీ నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం.

దేశవ్యాప్తంగా పరిశీలించి..
ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచినవారు ఎన్నికల్లో పోటీ సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను ఏడీఆర్‌ సంస్థ సేకరించి.. పరిశీలించింది. దేశవ్యాప్తంగా 774 మంది ఎంపీలు, 4,078 మంది ఎమ్మెల్యేల వివరాలను విశ్లేషించి.. ‘క్రైమ్‌ అగైనెస్ట్‌ ఉమెన్‌ (మహిళలపై వేధింపులు)’ కేసులున్న వారి వివరాలతో నివేదిక రూపొందించింది. మొత్తంగా  51 మంది ప్రజాప్రతినిధులు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లుగా కేసులున్నాయని.. అందులో 48 మంది ఎమ్మెల్యేలుకాగా, ముగ్గురు ఎంపీలని తెలిపింది. వీరితోపాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పార్టీల నుంచి పోటీచేసి ఓడిపోయిన 334 మంది అభ్యర్థులపైనా ఈ తరహా కేసులున్నట్లు తేల్చింది. ఈ జాబితాలో ఉన్న 48 ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధినేతగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందినవారు ఉన్నారు. మొత్తంగా చూస్తే... 14 మందితో నేరారోపితులతో బీజేపీ తొలిస్థానంలో, ఏడుగురు ఎమ్మెల్యేలతో ఎస్‌హెచ్‌ఎస్‌ (శివసేన)రెండో స్థానంలో, ఆరుగురితో ఏఐటీసీ (తృణమూల్‌ కాంగ్రెస్‌) మూడో స్థానంలో ఉన్నాయి. ఐదుగురు ఎమ్మెల్యేలపై కేసులతో టీడీపీ నాలుగో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్, బీజేడీ, జేఎంఎం, డీఎంకే, సీపీఎం ఉన్నాయి.

ఏడీఆర్‌ వెల్లడించిన జాబితా ప్రకారం.. మహిళలను వేధించిన కేసుల్లో ఏపీ సీనియర్‌ మంత్రి, కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర్‌రావు, మరో సీనియర్‌ మంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, విప్‌ చింతమనేని ప్రభాకర్, విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. ఇక ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణపై అత్యాచారయత్నం కేసు ఉంది. ఈయనపై 376 ఐపీసీతో పాటు 506, 511, 379, 366, 324 సెక్షన్ల కింద మహిళలపై వేధింపుల ఆరోపణలు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదికలో పేర్కొంది. ఈ ఎమ్మెల్యేలపై మహిళా వేధింపుల కేసులే కాకుండా మరిన్ని పోలీసు కేసులు కూడా ఉన్నాయని తెలిపింది. విప్‌ చింతమనేని ప్రభాకర్‌పై అత్యధికంగా 20 కేసులున్నట్టు పేర్కొంది.

ఇటీవల ఎత్తేసిన కేసుల్లో ఇవి కూడానా?
ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ జీవోలు జారీచేసింది. హత్యలు, దోపిడీ కేసులు, మహిళలపై వేధింపులకు పాల్పడ్డ కేసులు, ప్రభుత్వ అధికారులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలకు సంబంధించిన అనేక కేసులు ఈ ఉపసంహరణ జాబితాలో ఉన్నాయి. వాటిల్లో ఎమ్మెల్యేలపై కేసులు కూడా ఉన్నాయా అన్న సందేహం తలెత్తుతోంది. ప్రజాప్రతినిధులై ఉండి.. తప్పుడు చేష్టలకు పాల్పడినవారిపై కేసులను ఎత్తివేయడం దారుణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement