కశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి
ఇద్దరు సైనికులకు గాయాలు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఆర్మీపై దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్‌లోని పారింపురా నుంచి పంథాచౌక్‌కు వెళ్తున్న ఆర్మీ వాహనశ్రేణిపై శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు స్కిమ్స్ ఆసుపత్రి వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో చివరి వాహనంలో ఉన్న ఇద్దరు సైనికులు గాయాలపాలయ్యారు. ఆ సమయంలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై కొందరు దుండగులు రాళ్లు రువ్వడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. బలగాలు ప్రతిదాడి చేయడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారని పేర్కొన్నారు. ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేశామని వెల్లడించారు.
హోటల్‌లో మానసిక రోగి వీరంగం
శ్రీనగర్‌లోని ప్రముఖ వాణిజ్య ప్రాంతం లాల్‌చౌక్‌లో శనివారం కాల్పులు కలకలం రేపాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దుకాణాలన్నీ మూతపడ్డాయి. జనం మధ్య భయోత్పాతం సృష్టించిన ఓ మానసిక రోగిని పట్టుకునేందుకు పోలీసులు గాల్లోకి కొన్ని రౌండ్ల కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక్కడి ఓ హోటల్‌లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి అందులో ఉగ్రవాదులు ఉన్నారని, అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని హల్‌చల్ చేశాడని వెల్లడించారు. అక్కడికి పోలీసులు రావడంతో అతడు పారిపోవడానికి ప్రయత్నించగా వారు హెచ్చరికగా కాల్పులు జరిపారని పేర్కొన్నారు. చివరికి అతన్ని అదుపులోకి తీసుకున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు.