ఉగ్రవాదుల నయా ట్రెండ్!
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు తమ ట్రెండ్ మార్చారు. మార్కెట్లు, రద్దీగా ఉండే ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని కాకుండా.. రాజకీయ నాయకులను కూడా టార్గెట్ చేసి దాడులు జరపడానికి కుట్ర పన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులకు తాజాగా అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదుల విచారణలో తేలింది. రాజకీయ నాయకులు, విదేశీయులు, కీలక ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపాల్సిందిగా వారికి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు అధికారులు గుర్తించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారం మేరకు జాతీయ దర్యాప్తు బృందం అధికారులు దేశవ్యాప్తంగా పలువురు అనుమానితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఎన్ఐఏ అధికారులు 12 మందిని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారికి ఫిబ్రవరి 5వ తేదీ వరకు రిమాండ్ విధించింది. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.