‘పాక్ పై దండెత్తడానికి ఇదే సరైన సమయం’
న్యూఢిల్లీ: పాకిస్థాన్ కు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) పేర్కొంది. దాయాది దేశంపై దాడి చేసి పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి తెచ్చుకోవాలని వీహెచ్ పీ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర కుమార్ జైన్ అన్నారు. పాకిస్థాన్ తో యుద్ధానికి పార్లమెంట్ లో తీర్మానం ఆమోదించడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు.
‘పాకిస్థాన్ పై భారత్ దాడి చేయాలి. పీఓకేను స్వాధీనం చేసుకోవాలి. ఇది భారత న్యాయమైన హక్కు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే. దీనికి అనుగుణంగా పార్లమెంట్ లో తీర్మానం ఆమోదించాల’ని జైన్ వ్యాఖ్యానించారు. యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్ వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా స్పందన వ్యక్తమవుతోందని చెప్పారు. పాకిస్థాన్ ఇప్పుడు ఒంటరైందని, పొరుగుదేశంపై దండెత్తడానికి ఇదే సరైన సమయమన్నారు.