
రేపు దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష
♦ ఉద్యమం ఉధృతం చేస్తాం: హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ
♦ ఇన్‌చార్జి వీసీ శ్రీవాస్తవ మాట్లాడేవన్నీ అవాస్తవాలేనంటూ మండిపాటు
♦ శుక్రవారం రాత్రి దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీకి పిలుపు
♦ కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ అధ్యాపకుల రిలే దీక్షలు
♦ న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి వంద మంది అధ్యాపకుల లేఖ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఉద్యమాన్ని అఖిల భారత స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ పుట్టినరోజైన ఈనెల 30వ తేదీ నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావిస్తోంది. రోహిత్ ఆత్మహత్యకు సంతాపంగా, సామాజిక న్యాయాన్ని డిమాండ్ చేస్తూ...
శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒక రోజు మహాదీక్ష నిర్వహించనున్నట్లు విద్యార్థి జేఏసీ నాయకులు ప్రశాంత్, వెంకటేశ్ చౌహాన్, అర్పిత గురువారం ప్రకటించారు. రోహిత్‌తోపాటు సస్పెండైన విద్యార్థులు ప్రశాంత్, విజయ్, సుంకన్న, శేషయ్యలు శుక్రవారం రాత్రి నుంచి ఆమరణ దీక్షను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రోహిత్ మృతికి సంతాపంగా శుక్రవారం రాత్రి 11 గంటలకు దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఇన్‌చార్జి వీసీవన్నీ అబద్ధాలే..
హెచ్‌సీయూ ఇన్‌చార్జి వీసీ శ్రీవాస్తవ చెబుతున్నవన్నీ అవాస్తవాలేనని విద్యార్థి జేఏసీ నేతలు, ప్రశాంత్, వెంకటేశ్ చౌహాన్ ఆరోపించారు. తమతో చర్చించేందుకు వచ్చిన వర్సిటీ అధికారులను తమ డిమాండ్లపై నిలదీయగా... మళ్లీ వస్తామంటూ వెళ్లి, ప్రెస్‌క్లబ్‌లో అవాస్తవాలు చెప్పి తప్పించుకున్నారని మండిపడ్డారు. తరగతులు నిర్వహించేందుకు తాము అంగీకరించలేదని, కానీ తాము అంగీకరించినట్లు ఇన్‌చార్జి వీసీ అబద్ధం చెప్పారన్నారు.
విద్యార్థులు, అధ్యాపకుల్లో గందరగోళం రేపేందుకు, వారిని చీల్చేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. సైన్స్ విద్యార్థులు మాత్రం వీసీకి నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి ల్యాబ్‌లకు హాజరవుతారని, తరగతులు జరిపేందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. కాగా.. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని, వీసీ అప్పారావును, ఇన్‌చార్జి వీసీని తొలగించాలని కోరుతూ వంద మంది అధ్యాపకులు రాష్ట్రపతికి లేఖ రాసినట్లు ప్రొఫెసర్ వి.కృష్ణ తెలిపారు.
గురువారం నెల్లూరు నుంచి వచ్చిన బహుజన టీచర్స్ హెచ్‌సీయూలో ఒకరోజు రిలే దీక్షలో పాల్గొన్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ అధ్యాపక బృందం రిలే దీక్షలను కొనసాగిస్తోంది. శుక్రవారం నుంచి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు సైతం దీక్షలో పాల్గొననున్నారు. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో చలో ఢిల్లీ, జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలను యథాతథంగా నిర్వహిస్తామని విద్యార్థి జేఏసీ నేతలు ఉదయభాను, ప్రశాంత్, ధనుంజయ్, చరణ్, సంజయ్ పేర్కొన్నారు.
హెచ్‌సీయూ ఘటనపై ఏకసభ్య కమిషన్
సాక్షి, న్యూఢిల్లీ: హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర న్యాయ విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఏకసభ్య విచారణ కమిషన్‌ను నియమించింది. అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ కుమార్ రూపన్‌వాల్ నేతృత్వంలో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ...
మూడు నెలల్లో నివేదిక అందించాలని కోరింది. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, ఘటనల క్రమం, వాస్తవాలను గుర్తించి... తగు విధంగా దిద్దుబాటు చర్యలను ఈ కమిషన్ నివేదిస్తుందని కేంద్ర మానవ వనరుల శాఖ వర్గాలు తెలిపాయి.
హెచ్‌సీయూలో పార్లమెంటరీ కమిటీ పర్యటన!
రోహిత్ ఆత్మహత్య ఘటనపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలన జరపనుంది. దళిత విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని, వారికి అన్యాయం జరుగుతోందనే ఫిర్యాదుల నేపథ్యంలో.. ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై బీజేపీ ఎంపీ ఫగ్గన్‌సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన జేపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీయూతోపాటు, చెన్నై ఐఐటీలోనూ విద్యార్థులు, ప్రొఫెసర్లతో మాట్లాడి, పార్లమెంటు ఉభయ సభలకు నివేదిక సమర్పించనుంది.