సాక్షి, చెన్నై: రసాయనిక ఎరువులు, పురుగుమందుల అతి వినియోగం వల్ల వ్యవసాయోత్పత్తులు విషతుల్యంగా మారిపోతాయనడానికి ఇదొక తాజా నిదర్శనం. తమిళనాడులోని తిరుపూరు జిల్లా ఉడుమలైలో 4,500 ఎకరాల్లో కొబ్బరి చెట్లు విస్తరించి ఉన్నాయి. ఇటీవల అక్కడి చెట్ల నుంచి సేకరించిన కొబ్బరి కాయలు, కొబ్బరి బొండాలలోని నీళ్లు విషతుల్యంగా మారినట్లు తేలింది. రైతులే సమస్యను గుర్తించి స్థానిక వ్యవసాయూధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిపుణుల సూచనలతో నిమిత్తం లేకుండా రసాయనిక ఎరువులు, పురుగు మందులను విచ్చలవిడిగా వాడడం వల్లనే కొబ్బరి నీళ్లు విషతుల్యంగా మారాయని ఉడుమలై వ్యవసాయశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ చిన్నవేల్ నిర్ధారించారు. నిపుణుల సలహా మేరకు రసాయనాలను పరిమితంగా వినియోగించడం శ్రేయస్కరమని ఆయన రైతాంగానికి సూచించారు.