
లక్నో : ఆరేళ్ల పులిని దారుణంగా కర్రలతో కొట్టి చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. పిలిబిత్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలో ఉన్న మతైన గ్రామంలోకి బుధవారం ఓ పులి ప్రవేశించింది. గ్రామస్తుడిపై దాడి చేసి గాయపర్చింది. దాంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు కర్రలతో పులిని వెంబడిస్తూ.. చితకబాదారు. ఈ ఘటనలో దారుణంగా గాయపడిన పులి చనిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై స్పందించిన అటవీ అధికారులు పులిపై దాడి చేసి, చంపినందుకు గాను 31మంది గ్రామస్తుల మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పిలిబిత్ ప్రాంతంలో ఇలా జంతువులు మీద దాడి చేసి చంపడం ఇదే ప్రథమం అన్నారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.