రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం: ఉద్ధవ్
పింప్రి, న్యూస్‌లైన్: నరేంద్ర మోదీ ప్రధాని కావాలని కోరుకున్నవారిలో తామూ ఉన్నామని, అయితే ప్రధాని అయిన తర్వాత ఇక తనకెవరి సహకారం అవసరం లేదనే విధంగా మోదీ వ్యవహరిస్తున్నారని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. దేశాన్ని పాలించమన్నామే తప్ప రాష్ట్రాన్ని కాదని, ఇటువంటి వ్యవహారశైలి మోదీకి తగదని హితవు పలికారు. గురువారం సాయంత్రం చాకణ్‌లోని మార్కెట్ యార్డు మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఉద్ధవ్ ప్రసంగించారు. ఖేడ్-ఆలందీ, బోసిరి నియోజక వర్గాల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ సాగిన ఉద్ధవ్ ప్రసంగమంతా మోదీని విమర్శిస్తూనే సాగింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మహారాష్ట్రను ముక్కలు కానివ్వబోమని, విదర్భ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తామన్నారు.
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తామంటే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి పోరాటాలు చేసిన పార్టీ శివసేన ఒక్కటేనని, శివసేనకు పూర్తి మెజార్టీ అందించాలని ప్రజలను కోరారు. ఈ సభలో ఎంపీలు గజానన్ కీర్తీకర్, శివాజీరావు అడల్‌రావు పాటిల్, జిల్లా నాయకులు రాంగావడే, ఖేడ్ పంచాయతీ సమితి ఉప సభాపతి రాజేష్ జవలేకర్ రాజ్ గురుగగన్, మాజీ సర్పంచ్ అతుల్ దేశ్‌ముఖ్, ఇతర నాయకులు హాజరయ్యారు. ఇదిలాఉండగా ఖేడ్ పంచాయతీ సమితి, మార్కెట్ సమితి మాజీ అధ్యక్షులు రాందాస్ ఠాకూర్, అతని అనుచరగణం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శివసేన పార్టీలో శివసేన పార్టీలో చేరారు. ఖరాబ్‌వాడి ఉప సర్పంచ్, తాలూకా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నందాతాయి, ఎమ్మెన్నెస్‌కు చెందిన యోగేష్ అగార్కర్, వివిధ గ్రామాల సర్పంచులు పార్టీలో చేరినవారిలో ఉన్నారు.