రద్దుపై మోదీకి అమెరికా రాయబారి ప్రశంస
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం అమెరికా-భారత్ దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ భారత దేశంలోని అవినీతిని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నారని తమకు అర్థమైందని అన్నారు. అదే సమయంలో ప్రజలు పడుతున్న అవస్థలను కూడా తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. బుధవారం కోల్‌కతాలో జరిగిన ఓ సమావేశంలో పెద్ద నోట్ల రద్దుపై స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ రాయబార కార్యాలయంలో భారతీయ ఉద్యోగులు చాలా ఎక్కువ మంది ఉన్నారని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అలాంటిదానికి అంతంపలకాలని కోరారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిని దోషులుగా గుర్తించి శిక్షించాల్సిందేనని తెలిపారు. పాకిస్థాన్‌తో తమ దేశం చేసుకున్న రక్షణ ఒప్పందం దృష్టంతా ఉగ్రవాదాన్ని నిర్మూలించే అంశంలో భాగమేనని, కానీ భారత్‌తో సంబంధాల విషయంలో విస్తృతి పెద్దదని తెలిపారు. భారత్‌తో సంబంధాల తమకు చాలా ముఖ్యమైనవని అన్నారు.