దేశంలో సమాఖ్య స్ఫూర్తి ఎక్కడ! | Where is fedaralism in the country | Sakshi
Sakshi News home page

దేశంలో సమాఖ్య స్ఫూర్తి ఎక్కడ!

Published Thu, Jul 28 2016 5:15 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

Where is fedaralism in the country

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను హత్య చేయించినా చేయవచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్లో నిజానిజాలు పక్కన పెడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాఖ్యస్ఫూర్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం కేజ్రీవాల్‌తోనే మొదలు కాలేదు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీనే గుజరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ సారి అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

‘నన్ను ఖతం చేయడానికి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి సుపారీ (కాంట్రాక్ట్) ఇచ్చింది’ అని మోదీ 2010లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను వివిధ కేసుల్లో కేంద్రం ఆధీనంలోని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల కేజ్రివాల్ అసహనం వ్యక్తంచేస్తూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ రాష్ర్ట ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాలలాగా సంపూర్ణ అధికారాలు సంక్రమిస్తే తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాఖ్య ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లే అవకాశం లేదు. ఆ మాటకొస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాఖ్య స్ఫూర్తి ఏనాడూ లేదు. కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడూ తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కీలుబొమ్మ ముఖ్యమంత్రులనే పెట్టుకొంది. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రులుగా కొనసాగిన రోజుల్లోనూ ఇదే కొనసాగింది. స్వప్రయోజనాల కోసం ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను నీరుగార్చేందుకే ప్రయత్నించింది.

‘కోఆపరేటివ్ ఫెడరలిజమ్ (సహకార సమాఖ్యవాదం)’ తమ ప్రభుత్వ విధానాల్లో ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా చెప్పుకోవడాన్ని దేశ ప్రజలు హర్షించారు. ఇప్పుడు వివిధ కేసుల్లో ఆప్ ఎమ్మెల్యేలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగమని అదే ప్రజలు భావిస్తున్నారు. మాటలు వల్లించడమే కాదు, చేతల్లో చూపించినప్పుడే ప్రజలు ప్రభుత్వాన్ని విశ్వసిస్తారు.
--ఓ సెక్యులరిస్ట్ కామెంట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement