పాత పెద్ద నోట్ల రద్దుపై ఎవరేమన్నారు?
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో సామాన్యులతో పాటు సీనియర్ రాజకీయ నేతలు నివ్వెరపోయారు. నల్లధనం నిర్మూలనకు రూ. 500, రూ. వెయ్యి నోట్లను ఉపసంహరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో విభిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. అధికార ఎన్డీఏ, మిత్రపక్షాలు పెద్ద నోట్ల రద్దును స్వాగతించగా, విపక్షాలు తప్పుబట్టారు. ముందస్తు సన్నద్దత లేకుండా పాత పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యులను కష్టాల్లో పడేశారని ప్రతిపక్ష నాయకులు ధ్వజమెత్తారు. ఎన్డీఏ మిత్రపక్షమైనప్పటికీ ఈ విషయంలో శివసేన కూడా విపక్షాలతో గొంతు కలిపింది. పాత పెద్ద నోట్ల రద్దు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఎలా స్పందించారో ఒకసారి చూద్దాం.
మమతా బెనర్జీ
పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబడుతూ మొట్టమొదటగా గళం విప్పారు. ఏ మాత్రం దయ లేకుండా తీసుకున్న (పాశవిక) నిర్ణయమని వ్యాఖ్యానించారు. రూ. 500, రూ. వెయ్యి నోట్ల రద్దుతో సామాన్య, మధ్యతరగతి ప్రజల కష్టాల్లోకి నెట్టారని విమర్శించారు. పోస్టాఫీసులు, బ్యాంకుల ముందు క్యూలు కట్టుకుని బిచ్చగాళ్లలా ప్రజలు నిలబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టి బుధవారం రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
అరవింద్ కేజ్రీవాల్
అన్ని విషయాల్లో ప్రధాని మోదీ విరుచుకుపడే ఢిల్లీ సీఎం పాత నోట్ల రద్దుపైనా తీవ్రమైన ఆరోపణలు చేశారు. మోదీ అహంకారంతో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రూ. 500, రూ. వెయ్యి నోట్ల రద్దు వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆరోపించారు. నల్లకుబేరులకు ముందుగానే సమాచారం ఇచ్చి రద్దు నిర్ణయం తీసుకున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని ఢిల్లీ అసెంబ్లీలో ఓ తీర్మానం ప్రవేశపెట్టి.. రాష్ట్రపతికి దీన్ని పంపించారు.
రాహుల్ గాంధీ
సామాన్యులు, పేద ప్రజల గురించి పట్టించుకోకుండా ప్రధాని మోదీ లెక్కలేనితనంతో వ్యవహరించారని రాహుల్ వ్యాఖ్యానించారు. విజయ్ మాల్యా, లలిత్ మోడీ లాంటి వాళ్లను వదిలేసి సామాన్య ప్రజలను కష్టపెట్టడం సమంజసం కాదన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఆయన స్వయంగా బ్యాంకు ముందు క్యూలో నిలుచుకున్నారు. నల్లకుబేరులు ఎవరైనా బ్యాంకుల ముందు క్యూలో నిలబడడం చూశారా? అని ప్రశ్నించారు. నిజమైన దోపిడీదారులు తప్పించుకుంటున్నారని, విదేశాలతో పాటు, రియల్ ఎస్టేట్ల్లో దాచుకున్న నల్లధనాన్ని కేంద్రం వదిలి పెడుతోందని ధ్వజమెత్తారు.
మాయావతి
స్వప్రయోజనాల కోసమే పాత పెద్ద నోట్లను ప్రధాని మోదీ రద్దు చేశారని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. నిజంగా నల్లధనాన్ని వెలికి తీయాలనుకుంటే రెండేళ్ల క్రితమే పెద్ద నోట్లను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే పెద్ద నోట్లను రద్దు చేశారని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో గుజరాత్, ముంబై ప్రజలకు మాత్రమే లబ్ది చేకూరుతుందని వ్యాఖ్యానించారు.
అఖిలేశ్ యాదవ్
ప్రపంచ ఆర్థికసంక్షోభం సమయంలో భారత ఆర్థికవ్యవస్థను బ్లాక్మనీనే రక్షించిందని నిపుణులు అభిప్రాయం పడ్డారంటూ యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ విభిన్నంగా స్పందించారు. తాను బ్లాక్మనీని వ్యతిరేకిస్తున్నానని, తనకు అసలు ఆ డబ్బే వద్దని వాఖ్యానించారు. కేంద్రం నిర్ణయంతో సామాన్య ప్రజలు బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల ముందు పడిగాపులు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎవరైతే నల్లధనాన్ని రూ.500, రూ. వెయ్యి నోట్లలో దాచిపెట్టుకుని ఉంటారో, వారు మాత్రం ప్రస్తుతం రూ.2,000 నోట్ల కోసం వేచిచూస్తున్నారని పేర్కొన్నారు.
సీతారాం ఏచూరి
పెద్ద నోట్ల రద్దుతో ఏవిధంగా నల్లధనాన్ని నియంత్రిస్తారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రశ్నించారు. 90 శాతం నల్లధనం విదేశీ బ్యాంకుల్లో ఉందని 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారని, అలాంటప్పుడు పాత నోట్ల రద్దుతో ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. కొత్త నోట్లను ఎవరూ ఆమోదించడం లేదని, వీటి వల్ల ప్రయోజనం ఏంటని నిలదీశారు. ప్రధాని మోదీ ఇప్పుడు ఎవరినీ కరెన్సీ వాడొద్దని.. అన్నిచోట్లా కార్డులే వాడాలని చెబుతున్నారని, ఇది ఎలా సాధ్యమని అన్నారు.
సురవరం సుధాకర్ రెడ్డి
పెద్ద నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. విదేశాల్లో ఉన్న నల్ల కుబేరుల జాబితాను తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాలకు ఇప్పుడున్న రూ.500, రూ. వెయ్యి నోట్లు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సెప్టెంబర్లో జరిగిన లావాదేవీలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
నితీశ్ కుమార్
పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని విపక్ష నేతలు తప్పుపడుతుండగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ మాత్రం సానుకూలంగా స్పందించారు. ‘నా ఫుల్ సపోర్ట్ మీకే’ అంటూ ప్రధాని మోదీ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల నకిలీ నోట్లన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయని అన్నారు. బినామీ ఆస్తులపై దృష్టి పెట్టాలని సలహాయిచ్చారు.