మున్సిపాలిటీలకు కోట్లే.. కోట్లు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో పౌర సేవా సంస్థలకు బాగా కలిసొచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తంలో పన్నులు వసూళ్లయ్యాయి. ఆయా నగరాలకు చెందిన దాదాపు 47 మున్సిపాలిటీలకు ఈ ఒక్క నెల(నవంబర్)లోనే గత ఏడాదితో పోలిస్తే రెండున్నర రెట్లు పన్నులు వసూళ్లయ్యాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అంచనా ప్రకారం మంగళవారంనాటికి మొత్తం 47 మున్సిపల్ శాఖలకు పన్నుల రూపంలో దాదాపు రూ.13,192కోట్లు వచ్చాయి. గత ఏడాది (2015)లో ఇది కేవలం రూ.3,607కోట్లు మాత్రమే ఉంది. ఈ భారీ మొత్తంలో అత్యధికంగా పన్నులు రాబట్టిన నగరాల్లో ముంబయి తొలి స్థానంలో నిలిచింది. మొత్తం రూ.11,913కోట్లు(90శాతం) వసూలు చేసి ప్రథమ స్థానంలో నిలిచింది.
ఇది 2015తో పోలిస్తే మూడు రెట్టు అధికం. ఇక తదుపరి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ఇదే నెలలో గత ఏడాది రూ.8కోట్ల పన్నులు రాగా ఈ ఏడాది మాత్రం దాదాపు రూ.208 కోట్లు వసూళ్లు అయ్యాయి. అలాగే, సూరత్ మున్సిపాలిటీకి 100 కోట్లు (2015లో ఇక్కడ రూ.7కోట్లు మాత్రమే), అహ్మదాబాద్ కు 170 కోట్లు(గతంలో 78 కోట్లు), కల్యాణ్ కు 170 కోట్లు(గతంలో 120 కోట్లు) పన్నులు వసూళ్లయ్యాయి. ఇలా మొత్తం 47 మున్సిపాలిటీలకు 2015తో పోల్చినప్పుడు పెద్ద మొత్తంలోనే పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని పన్నుల రూపంలో డబ్బులు వచ్చి పడ్డాయి.