దేశాన్ని నాశనం చేసింది!
కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ధ్వజం
► 1971లోనే నోట్ల రద్దు చేసి ఉంటే.. ఇంత నష్టం జరిగేది కాదు
► వారికి దేశం కన్నా పార్టీనే ముఖ్యం
► బీజేపీకి దేశమే తొలి ప్రాథమ్యం
► పార్టీ ఎంపీల భేటీలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నోట్ల రద్దుపై నోరిప్పాలంటూ విపక్షాలు మూకుమ్మడిగా చేసిన డిమాండ్‌కు ప్రధాని మోదీ స్పందించారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు కోరినట్లుగా పార్లమెంటులో కాకుండా, గురువారం బీజేపీ పార్లమెంటరీ భేటీలో ఆయన తన వాదన వినిపించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడానికి కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ కారణమన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లక్ష్యంగా మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశం కన్నా కాంగ్రెస్‌కు పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ధ్వజమెత్తారు. 1971లో ఇందిరాగాంధీ హయాంలోనే నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఉంటే.. దేశం ఇంతగా నాశనమయ్యేది కాదని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుకు 1971లోనే వాంఛూ కమిటీ సిఫారసు చేసిందని గుర్తు చేస్తూ.. ‘ఆ ప్రతిపాదనతో నాటి ఆర్థిక మంత్రి వైబీ చవాన్ నాటి ప్రధాని ఇందిరాగాంధీ వద్దకు వెళ్లి.. నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. దానికి స్పందనగా ఇందిరాగాంధీ ‘ఒకే ప్రశ్న అడుగుతాను.. ఇకపై కాంగ్రెస్ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయొద్దా?’ అని చవాన్ ను ప్రశ్నించారని మోదీ పేర్కొన్నారు.
‘మీరు చెప్పండి.. కాంగ్రెస్‌కు పార్టీ ముఖ్యమా? దేశమా?.. కాంగ్రెస్‌కు పార్టీ ముఖ్యమైతే.. బీజేపీకి దేశ ప్రయోజనాలే ముఖ్యం’ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 1988లో బినామీ చట్టం చేసిందన్న మోదీ.. ఇంతవరకు దీన్ని నోటిఫై చేయలేదని, చట్టం అమల్లోకి వచ్చేలా విధివిధానాలను రూపొందించలేదని విమర్శించారు. ‘గతంలో ప్రతిపక్షాలు కుంభకోణాలకు వ్యతిరేకంగా సభాకార్యక్రమాలను అడ్డుకునేవి.. ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు నల్లధనానికి, అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలను వ్యతిరేకిస్తూ సభను అడ్డుకుంటున్నాయి’ అని ఎద్దేవా చేశారు. జ్యోతిబసు, హరికిషన్ సింగ్ సుర్జీత్ తదితర లెఫ్ట్ దిగ్గజాలు గతంలో నోట్ల రద్దుకు మద్దతివ్వగా.. ఇప్పుడు ఆ పార్టీల నేతలు తమ సిద్ధాంతాలతో రాజీ పడిపోయి.. కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారని ఎత్తి పొడిచారు.
తన నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించడాన్ని.. అక్రమార్కులు, అవినీతి పరులకు ఇస్తున్న మద్దతుకు ఉదాహరణగా మోదీ పేర్కొన్నారు. ‘పదేళ్లు అక్రమంగా సంపాదించిన ధనమంతా 11వ ఏడాది వ్యర్థమవుతుందం’టూ చాణక్య నీతిలో పేర్కొన్న అంశాన్ని గుర్తుచేస్తూ.. యూపీఏ పదేళ్ల పాలనలో దోచుకున్న ధనం ఇప్పుడు పనికిరాకుండా పోయిందని వ్యాఖ్యానించారు. బీజేపీతో సైద్ధాంతికపరమైన విభేదాలున్నా.. నోట్లరద్దుపై బహిరంగంగా మద్దతిచ్చిన బిహార్, ఒడిశా సీఎంలను మోదీ ఈ సందర్భంగా అభినందించారు.
మన్మోహన్ స్వరం మారిందెందుకు?
నోట్లరద్దు ఘోరతప్పిదమన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపైనా మోదీ విరుచుకుపడ్డారు. ‘1991లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు పన్ను ఎగవేతదారులను కఠినస్వరంతో హెచ్చరించిన మన్మోహన్ ఇప్పుడెందుకు స్వరం మార్చాల్సి వచ్చింది? ఎందుకంటే ఆయన తన పార్టీ గురించి బాధపడుతున్నారు. దేశం గురించి కాదు’అని విమర్శించారు. యూపీఏ హయాంలో నల్లధనంపై స్పందనలేకపోవటంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలనూ మోదీ గుర్తుచేశారు.
‘డిజిటల్’ప్రచారం చేయండి
అవినీతి, నల్లధనంపై పోరులో వెనకడుగు వేయవద్దంటూ పార్టీ ఎంపీలకు మోదీ పిలుపునిచ్చారు. డిజిటల్ లావాదేవీలను తమ జీవన విధానంలో భాగంగా చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘క్రిస్మస్ గిఫ్ట్’ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అధికారులకు అపరిమిత అధికారాలిచ్చారన్న విమర్శలను ఖండించిన మోదీ.. ‘అధికారుల రాజ్యం నడవదు. నవంబర్ 8కి ముందు ప్రజల లావాదేవీలపై పోస్టుమార్టం చేయాల్సిన పనిలేదు. వారిని డిజిటల్ లావాదేవీలవైపు ప్రోత్సహించండి’ అని అన్నారు.