కన్హయ్య చేసిన నేరమేంటి: దిగ్విజయ్
న్యూఢిల్లీ:
విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) రూ.10 వేల జరిమానా విధించడాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తప్పుపట్టారు. దయచేసి కన్హయ్య చేసిన నేరమేంటో ఎవరైనా మాకు చెప్పుతారా అంటూ ప్రశ్నించారు. కన్హయ్యను దొషిగా తేల్చడానికి ఎలాంటి ఆధారాలు లేవు, అలాంటప్పుడు ఎందుకు అతన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారిని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఆఫ్జల్‌గురు ఉరితీతకు వ్యతిరేకంగా గత ఫిబ్రవరి 9న కార్యక్రమం నిర్వహించిన విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు జేఎన్‌యూ సోమవారం రూ.10 వేల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఉమర్ ఖాలిద్ సహా ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఫిబ్రవరి 9 నాటి కార్యక్రమంపై దర్యాప్తు జరిపేందుకు వర్సిటీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ.. సాక్ష్యాలు, వీడియో క్లిప్పింగులు తదితరాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఉమర్, అనిర్బన్ భట్టాచార్యలు వర్సిటీలో మత హింసకు, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని పేర్కొంది.
ఈ మేరకు ఉమర్‌ను ఒక సెమిస్టర్, ముజీబ్ గట్టూను రెండు సెమిస్టర్లు, భట్టాచార్యను జూలై 15 వరకు బహిష్కరించింది. జేఎన్‌యూలో వచ్చే ఐదేళ్ల వరకు ఎలాంటి కోర్సు చేయకుండా భట్టాచార్యపై నిషేధం విధించింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడన్న నేరంతో ఏబీవీపీ నాయకుడు సౌరభ్ శర్మకు కూడా రూ.20 వేల జరిమానా విధించింది. మొత్తంగా 14 మందిపై జరిమానా విధించింది. అయితే పరిపాలన శాఖ ఉద్యోగులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
Kanhaiya fined 10000/-. Would anyone pl tell us what is his crime ? Why is he being persecuted ? There is no evidence against him.
— digvijaya singh (@digvijaya_28) 26 April 2016