కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం ఆదివారం సాయంత్రం భేటీ అయ్యింది.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తో ఆదివారం సాయంత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం భేటీ అయ్యింది. కేంద్రమంత్రులు, ప్రధానమంత్రిని కలిసేందుకు రెండు రోజుల పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే వైఎస్ జగన్ బృందం అరుణ్ జైట్లీతో భేటీ అయ్యింది. అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో వైఎస్ జగన్ బృందం భేటీ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రానికి అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందించాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రానికి నివేదించడానికి ఆయన తన పార్టీకి చెందిన ఎంపీలతో కలసి శనివారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 23 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కీలక అంశాలను కేంద్రం దృష్టికి తేవాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన తలపెట్టారు.