
ఏపీకి చేయూతనివ్వండి: వినతులతో ఢిల్లీకి చేరిన జగన్
- ఏపీకి చేయూతనివ్వండి: వినతులతో ఢిల్లీకి చేరిన జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రానికి అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రానికి నివేదించడానికి ఆయన తన పార్టీకి చెందిన ఎంపీలతో కలసి శనివారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 23 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కీలక అంశాలను కేంద్రం దృష్టికి తేవాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన తలపెట్టారు.
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించి తగిన రీతిలో ఆదుకోవాలని కోరడానికిగాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు తదితరుల అపాయింట్‌మెంట్ కోరారు. వారి అపాయింట్‌మెంట్ ఖరారవగానే రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఆయన నివేదించనున్నారు. కాగా హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆదివారం ఉదయం 11 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి కలవనున్నారు.
ఈ నెల 26న రైల్వే బడ్జెట్, 28న సాధారణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా రాష్ట్రానికి తగిన కేటాయింపులు జరపాలని జగన్ నేతృత్వంలోని బృందం కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక రాయితీలు కల్పించడం, ప్రత్యేక రైల్వే జోన్, కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం, ఇతర పెండింగ్ ప్రాజెక్టులకు తగిన కేటాయింపు జరపడం వంటి అంశాలను వైఎస్ జగన్ ప్రధానికి, కేంద్ర మంత్రులకు వివరించనున్నారు.
సీఆర్‌డీఏ పరిధిలో రాష్ట్ర రాజధాని పేరుతో భూసమీకరణ అంశంలో ప్రభుత్వం నుంచి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్నీ కేంద్రం దృష్టికి తేనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లమధ్య తలెత్తిన జల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కారం చూపించాలని కోరనున్నారు. నాలుగు రోజులుగా నలిగిన నాగార్జున సాగర్ జలవివాదం, అందుకు దారితీసిన పరిస్థితుల్ని ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ కోరిన నేపథ్యంలో జగన్ సోమవారం వరకు ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి.