బాబు అక్రమాలపై విస్తుపోయిన జాతీయ నేతలు
న్యూఢిల్లీ: అధికారంలో కొనసాగడానికి పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు కనీసంగా 40 కోట్ల రూపాయలు ఎరవేసి కొనుగోలు చేస్తున్న చంద్రబాబు నాయుడు తీరుపై ఆయా పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలు విస్మయం చెందారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు రకరకాలుగా ప్రలోభపెడుతూ టీడీపీలో చేర్పించుకుంటున్న వైనం, రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతి అక్రమాలపై సేవ్ డెమాక్రసీ పేరుతో జాతీయస్థాయిలో వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది.
ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర సీనియర్ నేతలు సోమవారం ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. సేవ్ డెమాక్రసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా జాతీయ స్థాయిలోని అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి రాష్ట్రంలో చంద్రబాబు అరాచక అవినీతి అక్రమాలను వివరిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్, జేడీయూ నేత శరద్ యాదవ్ తదితరులను కలిసి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న అప్రజాస్వామిక, అరాచక పరిపాలనపై సమగ్రంగా ఉదాహరణలతో సహా వివరించారు.
నేతలను కలిసినప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఒక్కో సంఘటనను వివరించినప్పుడు జాతీయ స్థాయి నేతలు విస్మయం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఇంతగా బరితెగింపు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న విధానాలు ఆ నేతలను ఆశ్చర్యపరిచింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తూ జరుగుతున్న వివరాలు తెలుసుకున్న ఆ నేతలు ఇలాంటి చర్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత సమావేశాల్లో దీన్ని లేవనెత్తుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అక్రమాలను ప్రస్తావిస్తూ చట్టాలను మరింత కఠిన తరం చేయాల్సిన ఆవశ్యకతను కూడా పార్లమెంట్ లో లేవనెత్తుతామన్నారు.
ఒక్కో ఎమ్మెల్యేను టీడీపీలోకి రప్పించుకోవడానికి 40 కోట్ల రూపాయలు ఎరవేయడమే కాకుండా, వారికి కావలసిన పనులు చేసి పెడతామని, కొందరికి మంత్రిపదవులు ఇస్తామని... ఇలా రకరకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారని, మరికొందరిపై బెదిరింపులకు దిగుతున్నారని ఆయా పార్టీల నేతలకు వైఎస్సార్ సీపీ ప్రతినిధి బృందం వివరించింది. ఈ సందర్భంగా రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగించిన అవినీతి అక్రమాల వివరాలతో ముద్రించిన 'ది ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పుస్తకాన్ని ఆయా నేతలకు అందించడమే కాకుండా పలు అవినీతి కుంభకోణాలపై వివరించారు.
చంద్రబాబు పాల్పడిన అవినీతి అక్రమాలను వివరించినప్పుడు ఇంతటి రాజకీయ అవినీతిని తానెప్పుడూ చూడలేదని సీతారాం ఏచూరి ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి అవినీతి అక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు మంటగలుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు చంద్రబాబు అక్రమాలకు వ్యతిరేకంగా నినదించాల్సిన అవసరముందన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యమంటే ప్రజలకు నమ్మకం లేకుండాపోతోందని, అవసరమైన మేరకు చట్టాలను మరింత కఠినతరం చేసేలా పార్లమెంట్ లో ఈ విషయాలను లేవనెత్తుతానని చెప్పారు.
జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఈ వివరాలను తెలియజేస్తూనే అపాయింట్ మెంట్ ఇస్తే రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కూడా కలిసి చంద్రబాబు అవినీతిని విడమరిచి చెప్పనున్నారు.