శాన్ డియాగో : ప్రముఖ సాప్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ ఎరవెల్లి ఆకస్మిక మృతి పట్ల అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) దిగ్భాంత్రి వ్యక్తం చేసింది. కరీంనగర్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన శ్రీనివాస్ 20 ఏళ్లుగా కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నగరంలో నివసిస్తున్నారు. ప్రఖ్యాత కంపెనీ క్వాల్‌కామ్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగానికి డైరెక్టర్‌గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు.
గణితం, కంప్యూటర్ సైన్స్‌లో శ్రీనివాస్‌కు ప్రావీణ్యం ఉంది. చిన్ననాటి నుంచి ఆయనకు గణితంపై ఉన్న కుతూహలమే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకునేలా చేసింది. అనంతరం ఆయన అరిజోనా స్టేట్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఖాళీ సమయంలో శ్రీనివాస్ స్థానిక పాఠశాలలకు వెళ్లి గణితాన్ని బోధించేవారు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
శ్రీనివాస్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ఆటా ప్రగాఢ సానుభూతి తెలిపింది. శ్రీనివాస్ ఆటా రీజినల్ డైరెక్టర్లలో ఒకరైన వెంకట్ తుడికి సోదరుడు. కాగా, శుక్రవారం శాన్‌డియాగోలోని గ్రీన్ వుడ్ మెమోరియల్‌లో శ్రీనివాస్ భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.