మహాత్మాగాంధీ కలలుగన్న స్వచ్ఛ భారతాన్ని నిజం చేస్తామంటూ ప్రధా ని నరేంద్ర మోదీ
మహాత్మాగాంధీ కలలుగన్న స్వచ్ఛ భారతాన్ని నిజం చేస్తామంటూ ప్రధా ని నరేంద్ర మోదీ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, సెలబ్రిటీలుగా పిలిచే వివిధ రంగాల ప్రముఖులు మాస్క్‌లు, గ్లౌజులు, నల్ల కళ్లద్దాలు, స్పోర్ట్స్ షూస్‌తో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మాబోటి మా పాతతరం వారికి గాంధీజీ కల లుగన్నది ఈ స్వచ్ఛ భారతమేనా? అని సందేహం కలుగుతోంది. గాంధీజీ మనకు బోధించింది ఒక్కటే. ప్రతి వ్యక్తి తను ఎక్కడ ఉంటే అక్కడ తన చు ట్టూ ఉన్న పరిసరాలను అనునిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని. అదీ ఆ పని తానే స్వయంగా ఏ అట్టహాసం, ఆర్భాటం, ప్రచారం లేకుండా దైనం దిన చర్యలా చేయాలని.
శరీరాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కున్నట్టే మనసును లేదా ఆత్మను కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచు కోవాలనేదే గాంధీజీ బోధనల సారం. స్వచ్ఛ భారత్ పేరిట ప్రచార ఆర్భా టం కోసం తాపత్రయ పడుతున్న వారు... తాము, తాము నివసించే భవనాలు పరిశుభ్రంగా ఉంటున్నాయనొచ్చు. కానీ దప్పికగొన్న గొంతులు నీటి చుక్క కోసం అల్లాడుతుండగా... నివాసంలోని స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడటాన్ని ఏమనాలి? సమాజంలో అభాగ్యులందరిలోకీ అభాగ్యుని ఆకలిదప్పులు తీర్చడమే, సేవ చేసి సౌఖ్యం కలుగజేయడమే లక్ష్యం కావా లని గాంధీజీ భావించేవారు.
తద్వారానే ఆత్మ లేదా మనస్సు పరిశుభ్ర మౌతుంది. ఎదుటివారు పస్తులుండగా విలాసవంతమైన విందులు, వేడు కల పేరిట ఆహార పదార్థాలను చెత్త కుండీలకు చేర్చడం వల్ల ఆత్మ మలినం కాక తప్పదు. నేడు స్వచ్ఛ భారత్ పేరిట వీధులకెక్కుతున్న ప్రముఖులంతా పేదల కడుపునింపడానికి, మురికివాడల ప్రజలకు మంచి గృహవసతికి, పారిశుద్ధ్యానికి తమ సంపదల్లో కొంతైనా ఎందుకు వెచ్చించరు? అదే చేస్తే వీధుల్లో బిచ్చగాళ్లు, గూడు కరువైన ప్లాట్ ఫామ్ జీవులు కనిపించరు. ఏ అక్రమ మార్గానో కోట్లకు పడగలెత్తినవారి అవినీతిగ్రస్త సం పద అంటరాని మాలిన్యమే అవుతుంది. ప్రధాని మోదీ నిజంగానే గాంధేయ స్వచ్ఛ భారతానికి కట్టుబడి ఉంటే అవినీతి మురికిని, చెత్త ను తొలగించే గొప్ప ప్రజా ఉద్యమంగా స్వచ్ఛభారతాన్ని మలచాలి.
కానీ దురదృష్టవశాత్తూ ఆయన అటువైపు దృష్టి కేంద్రీకరించడమే లేదు. ఇటీవలే ఆయన అంబానీలు ముంబైలో నిర్మించిన ఒక పెద్ద కార్పొరేట్ రీసెర్చ్ ఆసుపత్రికి ప్రారంభోత్సవం చేశారు. సకల సదుపాయాలున్న మహానగరంలో, సంపన్నులు, అధిక ఆదాయవర్గాల వారి కోసం మరో ఆసుపత్రిని నిర్మించే బదులు ఏ సదుపాయాలూ లేని గిరిపుత్రుల కోసమో లేక మరేదైనా వెనుకబడిన ప్రాంత ప్రజల కోసమో దాన్ని నిర్మించాలని అంబానీలకు నచ్చజెప్పాల్సింది. ప్రధాని మోదీ గాంధీజీ కలలుగన్న స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరికీ తిండి, బట్ట, నీరు, వసతి, పారిశుద్ధ్య సదు పాయాలు కలుగజేయడంపై ఇక దృష్టిని కేంద్రీకరించాలని విజ్ఞప్తి.
వి. సుబ్బారెడ్డి ఉప్పల్, హైదరాబాద్