కావేరీ తీరంలో తెలుగు కళా తోరణం
కొద్దికాలం క్రితం వరకు మేళా కుటుంబాల వారికి ప్రదర్శనలే వృత్తి. ఇప్పుడు కొందరు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నా, ఏటా మేలత్తూరు వచ్చి ప్రదర్శనలలో పాల్గొని, ఆ కళ పట్ల తమ నిబద్ధతని చాటుకుంటున్నారు.
తెలుగు భాష, సంస్కృతి, కళారూపాలు నిరంతరం ప్రభవించాలని ఆశించేవారూ, అవి ధ్వంసమైపోతున్నాయని కేవలం ఇక్కడ వీరావేశం ప్రదర్శించే వారూ కూడా కావేరీ తీరంలో ఉజ్జ్వలంగా వెలుగుతున్న ఆ దీప తోరణాన్ని ఒక్కసారి దర్శించడం మంచిది. లేదా ఆ వెలుగుల గురించి తెలుసుకున్నా మేలే. నాలుగు శతాబ్దాలుగా ఆ దీపతోరణం నిశ్చలంగా వెలుగుతోంది.
తంజావూరు సమీపంలో తిరువయ్యూరు దగ్గర మేల త్తూరులో ఏటా మే మాసంలోనే వారం రోజులు నరసింహ జయంతి పేరిట ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ తిరువయ్యూరు దగ్గరే త్యాగరాజ స్వామి సమాధి ఉంది. నరసింహ జయంతికి ఆ ఊళ్లో నృత్య నాటకాలు గొప్పగా ప్రదర్శిస్తారు. అవన్నీ తెలుగు నాటకాలే. ఈ విషయం తెలిసిన వారు తెలుగునాట ఎందరున్నారో గానీ, అక్కడ నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. మేల త్తూరు భాగవత మేళా నాట్య విద్యా సంఘం(మే 10 -18), భాగవత నాట్య నాటక సంఘం (మే 24-31) కూడా ఈ ఉత్సవాలు జరుపుతున్నాయి. రెండో సంస్థ 74 సంవత్సరాల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నది. తమిళనాట ఉన్న మేలత్తూరు తెలుగు పల్లెను తలపిస్తుంది. ఆ గ్రామంలో వేంచేసి ఉన్న నరసింహస్వామి ప్రీత్యర్థం ఈ కళారూపాలను ప్రదర్శిస్తారు. ఆరు నెలల క్రితం ఈ గ్రామం వెళ్లి భాగవత మేళా నాటక బృందాల పెద్దలు కె. కుమార్, మహాలింగం గార్లను కలుసుకున్నపుడు కొన్ని విషయాలు తెలిశాయి.
నరసింహస్వామి కోవెలలో పూజలు చేసి నాటక బృందాలు ప్రదర్శనలు ప్రారంభించడం సంప్రదాయం. నృసింహ జయంతికి మొదలయ్యే ఈ నాటకోత్సవాలకు ‘ప్రహ్లాద చరిత్ర’తోనే శ్రీకారం చుడతారు. ఏటా డిసెంబర్‌లో చెన్నైలో జరిగే సంగీత నృత్యోత్సవాలలో కొన్ని భాగవత మేళా ప్రదర్శనలు కూడా ఉంటాయి. అప్పుడే కె. నటరాజన్, కె. కుమార్ ప్రదర్శించిన ‘సతీ సావి త్రి’ చూడడం తటస్థించింది. రంగస్థలం మీద ఎడమ వైపున భాగవతులు మృదంగం, వేణువు వంటి వాయిద్యాల సహకారంతో ఇతివృత్తాన్ని గానం చేస్తుంటారు. మధ్య మధ్య ప్ర యోక్త దృశ్యాలనీ, పాటనీ అనుసంధానం చేస్తూ ఉంటాడు. గణేశ స్తుతి, హారతి, అరటిపళ్ల నైవేద్యాల తరువాత కథ ఆరంభమవుతుంది. బ్రాహ్మణులూ, అందులోనూ పురుషులు మాత్రమే ప్రదర్శించే ఈ నాటకాలు పన్నెండని చెబుతారు. అవి- ప్రహ్లాద చరిత్రతో పాటు రుక్మిణీ కల్యాణం, మార్కండేయ చరిత్ర, ఉషాపరిణయం, హరిశ్చంద్ర, సీతా కల్యాణం, పార్వతీ కల్యాణం, కంసవధ, హరిహర లీలావిలాసం, ధ్రువ చరిత్ర- వాటిని మేలత్తూరు వెంకటరామ శాస్త్రి రాశారు.
మేలత్తూరుకు చెందిన కుమార్, మహాలింగం కుటుం బాలు తాము తెలుగువారమనే చెబుతాయి. కానీ మాట్లాడేది తమిళమే. తెలుగు చదవడం, రాయడం రాకున్నా ఈ తెలుగు నాటకాలను భట్టీయం వేసి ప్రదర్శిస్తారు. త్యాగరాజ స్వామి సంగీత సంప్రదాయంలోనే ఉన్నప్పటికీ, ఉచ్చారణ మీద తమిళ ప్రభావం గణనీయంగా గమనిస్తాం. మొదట వీటిని దైవ సన్నిధిలోనే ప్రదర్శించేవారు.ఇటీవలికాలంలో వీధిలో రంగస్థలం, విద్యుద్దీపాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.
అందుతున్న ఆధారాల ప్రకారం 14వ శతాబ్దంలో నరసింహస్వామి సన్నిధిలో ఒక ప్రదర్శన జరిగింది. 1510లో షోలింగాపురం(షోలింగర్) నరసింహస్వామి ఆలయంలో ఒక నృత్య నాటకం ప్రదర్శించారు. విజయనగర పాలకుడు అచ్యుతరాయల దేవేరి తిరుమలదేవి శ్రీరంగం వచ్చినపుడు ఒక ప్రదర్శన ఇవ్వవలసిందని కోరిందట. అచ్యుతప్పనాయకుడు (1561-1614) తన ఏలుబడిలో 510 బ్రాహ్మణ కుటుంబాలకు ఒక గ్రామాన్ని దానం చేసి, ఈ కళకు చేయూతనిచ్చాడు. తరువాత శాలియ మంగళం, నల్లూరు, ఊత్తుకారు, శూలమంగళం, తెప్పరహతనల్లూరు అనే గ్రామాలను కూడా దానం చేశాడు. వీటన్నిటినీ కలిపి అచ్యుతాబ్ది అం టారు. 1855 తరువాత ఈ ప్రాభవం కొంత సన్నగిల్లింది. కొంతకాలానికి భారతం నటేశ అయ్యర్, గణేశ అయ్యర్ వంటి వారి కృషితో మళ్లీ ప్రదర్శనలు మొదలయినాయి.
కొద్దికాలం క్రితం వరకు మేళా కుటుంబాల వారికి ప్రదర్శనలే వృత్తి. ఇప్పుడు కొందరు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నా, ఏటా మేలత్తూరు వచ్చి ప్రదర్శనలలో పాల్గొంటున్నారు. ఇప్పటికీ ఈ కుటుంబాలే ఈ కళకు ఆలంబన. కేంద్రం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, కొన్ని ప్రైవేటు సంస్థలు చేయూతనిస్తున్నాయి. ఆ కళాకాంతులను చూసైనా ఆనందిద్దాం!
వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక