
మాటల మాయాజాలం?
తన కుశాగ్రబుద్ధి, వాగ్ధాటి కలిపి పదకొండు మాసాలుగా తెలంగాణ సమాజాన్ని మంత్రించి శాసించగలిగారు కేసీఆర్. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది. వెనక్కి తిరిగి చూస్తే మాటలే మిగులుతాయా? చేతలు ఏమైనా ఉంటాయా?
ప్రాంతీయ నాయకులు తమ పార్టీలకు అధ్యక్షులుగా ఏకగ్రీవం గా ఎన్నిక కావడంలో విశేషం లేదు. బహుజన సమాజ్‌కు మాయావతి, అన్నా డీఎంకేకి జయలలిత, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబునాయుడు, బీజేడీకి నవీన్ పట్నాయక్ పోటీ లేకుండా అధినేతలుగా ఎన్నికైనట్టే కల్వ కుంట్ల చంద్రశేఖరరావు కూడా మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడుగా ఎన్నికై నారు. అధినేతలతో పోటీకి నామినేషన్ దాఖలు చేసే దమ్ములు ఎవరికుం టాయి? పదమూడు సంవత్సరాలుగా పెంచి పోషించిన పార్టీలో ఆయనను కాదనే శక్తి ఎవరికుం టుంది? కల్వకుంట్లవారికిది కలిసొచ్చే కాలం. వాగ్దేవీకటాక్షం దండిగా ఉన్న కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని అధికారం చెలాయిస్తున్నారు. ఆ కుటుంబాన్ని అడ్డుకొని ఆపుచేసే శక్తిసామర్థ్యాలు కలిగిన వ్యక్తులు కానీ పార్టీలు కానీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. కేసీఆర్ ఎంతటి శక్తిమం తుడైన మాటల మాంత్రికుడు కాకపోతే సోనియా గాంధీ లాంటి వ్యక్తిని బురిడీ కొట్టించగలడు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం వంద శాతం ఖాయ మంటూ నమ్మబలికిన కేసీఆర్ విభజన బిల్లు పార్ల మెంటు ఆమోదం పొందిన మరుక్షణంలో విలీనం, గిలీనం జాన్తా నై అంటే నివ్వెరబోయిన సోనియా గాంధీకి నోట మాట రాలేదట కొన్ని రోజుల పాటు. కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా స్వతంత్రంగా పోటీ చేసి తెలంగాణ అసెంబ్లీలో మెజా రిటీ స్థానాలు గెలుచుకొని అనూ హ్యంగా అద్భుత విజయం సాధించిన అనంతరం ముఖ్య మంత్రి కేసీఆర్ పని నల్లేరుమీద బండి చందమే.
ఒక భుజం కుమారుడు కేటీఆర్, రెండో భుజం మేనల్లుడు హరీశ్‌రావు, తన కుశాగ్రబుద్ధి, వాగ్ధాటి కలిపి పదకొండు మాసాలుగా తెలం గాణ సమాజాన్ని మంత్రించి శాసించగలిగారు కేసీఆర్. అరు దైన జ్ఞాపకశక్తి, రాజకీయ వ్యూహ రచనా సామర్థ్యం, అసాధారణమైన చొరవ కేసీ ఆర్‌ను రాజకీయ శిఖరాగ్రంలో నిలిపాయి. తెలం గాణ జలవనరులూ, జనవనరులూ ఆయనకు తెలి సినంత లోతుగా మరొకరికి తెలియవు. ఏ విషయం ఎట్లా చెబితే ప్రజలకు అర్థం అవుతుందో ఆయనకు తెలిసిన విద్య. అధికారంలోకి వచ్చి ఏడాది కావ స్తున్నది. వెనక్కి తిరిగి చూస్తే మాటలే మిగులు తాయా? చేతలు ఏమైనా ఉంటాయా? ప్రజ లు ఆలోచిస్తారు? మాటల మంత్రం అన్ని వేళలా పని చేయదు. జనం అనుభవానికి భిన్నంగా మనం ఏమి చెప్పినా వారు నమ్మరు. మాటలతో చేతలు కూడా సరితూగినప్పుడే ప్రజలు హర్షిస్తారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పథకాలు సకాలంలో, అవి నీతికి అతీతంగా, సమర్థంగా అమలు జరిగితే, విద్యుచ్ఛక్తి లోటు పూడ్చగలిగితే, నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయగలిగితే కేసీఆర్‌కు తెలం గాణ ప్రజలు బ్రహ్మరథం పడతారు. లేకపోతే ఏమి జరుగుతుందో చరిత్ర చదువుకున్న వారికి ప్రత్యే కంగా చెప్పవలసిన అవసరం లేదు.
-క్రీడి