కాంగ్రెస్‌ని ముంచింది ‘డిగ్గీరాజా’నే | Ksr interviews dharmapuri srinivas | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ని ముంచింది ‘డిగ్గీరాజా’నే

Published Wed, Jun 14 2017 12:45 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

కాంగ్రెస్‌ని ముంచింది ‘డిగ్గీరాజా’నే - Sakshi

కాంగ్రెస్‌ని ముంచింది ‘డిగ్గీరాజా’నే

మనసులో మాట
కొమ్మినేని శ్రీనివాసరావుతో టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌
తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీని నిండా ముంచిన ఘనత దిగ్విజయ్‌ సింగ్‌కే దక్కుతుందని తెరాస సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ స్పష్టం  చేశారు. కేసీఆర్‌తో పొత్తును డిగ్గీ రాజా వ్యతిరేకించడమే తెలంగాణలో కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం కలిగించిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో అయినా సరే ప్రజల సంతోషమే కీలక విషయమైన విషయమని, వారు సంతోషంగా ఉన్నారా లేదా అనేది వచ్చే ఎన్నికల్లోనే తేలుతుందని  పాలకుల విజన్‌ అనేది మాటల్లో  కాకుండా చేతల్లో ఉంటుందని ఆ విషయంలో కేసీఆర్‌ అద్వితీయుడని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు అప్పుడు ఉండి చేసిందేమిటి,  ఇప్పుడు చేయబోయేది ఏమిటి అని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసులో రాజీ ప్రసక్తే లేదని ఈరోజుకీ ఈ విషయంలో రెండు రాష్ట్రాల్లో గొడవ రేగుతూనే ఉందంటూ  డి. శ్రీనివాస్‌ చెబుతున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

కాంగ్రెస్‌ పార్టీలో అన్నీ అనుభవించిన తర్వాతే పక్కకు పోయారని మీపై ఒక విమర్శ?
పార్టీకి సేవ చేసే పదవులు అనుభవించాను. కానీ మాట మాత్రంగా కూడా కనీసం చెప్పకుండా నా జిల్లాలో నేను తీసుకొచ్చి ఎదిగించిన అమ్మాయికి నా సీటు ఇస్తామని చెప్పడంతో చాలా గాయపడ్డాను. దీనిపై సోనియాగాంధీకే ఉత్తరం రాశాను. సమాధానం రాలేదు. ఎప్పటికైనా ఆమె పిలిపించి మాట్లాడుతుందని ఆశించాను. అది కూడా లేదు. దశాబ్దాలు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడిన నాకు కనీస సమాచారం చెప్పకుండా పక్కన బెట్టడం, తర్వాతయినా సీటు ఇస్తారన్న గ్యారంటీ లేకపోవడంతో చివరకు నిర్ణయం తీసుకుని పార్టీని వదిలిపెట్టాను.

ఎక్కడ తేడా వచ్చిందంటారు?
దిగ్విజయ్‌ సింగే ప్రధాన కారణం. 2007 నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ ఈ రాష్ట్రంలో చేసిన వ్యవహారాలపై రాష్ట్ర విద్యామంత్రి స్థాయిలో సోనియాగాంధీకి ఉత్తరం రాశాను. వైఎస్‌ అప్పటికి బతికే ఉన్నారు. అయితే నేను రాసిన ఆ ఉత్తరం దిగ్విజయ్‌ చేతికి వెళ్లింది. అప్పటి నుంచి నాపై వ్యతిరేకత పెంచుకున్నారు. 2014కు ముందు మళ్లీ ఇన్‌చార్జ్‌గా వచ్చాక దిగ్విజయ్‌ నన్ను డామేజ్‌ చేయాలని చూసి, పార్టీనే నాశనం చేశాడు.

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు కలిసిపోతాయని చెప్పారు. అదీ జరగలేదు కదా?
దాన్ని చెడగొట్టింది కూడా ఈ మహానుభావుడే. దిగ్విజయ్‌ సింగే చెడగొట్టాడు. కాంగ్రెస్, తెరాస పొత్తు అంటేనే ఆయనకు ఇష్టం ఉండేది కాదు. కేసీఆర్‌ను కలుపుకోని పోవాల్సిందే అని నేను సోనియాతో రెండు మూడుసార్లు గట్టిగా చెప్పాను. ఎందుకు జరగలేదంటే కాంగ్రెస్‌ పార్టీలో కోటరీ ప్రభావం ఎక్కువ.

తెలంగాణ సాధించిన క్రెడిట్‌ మీరు ఎవరికి ఇస్తారు?
తెలంగాణ అనే కాదు ఏ ఉద్యమమైనా తీసుకోండి. ఫైటర్‌ విల్‌ గెట్‌ ది క్రెడిట్‌. నాట్‌ ది గివర్‌.. పోరాడిన వాడికే పేరు వస్తుంది కానీ ఇచ్చినవాడికి రాదు. ఆ కోణంలో సోనియా గాంధీ తప్ప మరెవరున్నా తెలం గాణను ఇచ్చి ఉండేవారు కాదు. ఆమె కన్విన్స్‌ అయ్యారు.  తెలంగాణ ఇస్తే ఫలితాలు ఎలా ఉంటాయని ఆమె పది మందిలో చర్చించేవారు. మొత్తంమీద తెలంగాణను ఇవ్వాలని ఆమె నిర్ణయించుకుంది.

తెలంగాణలో కేసీఆర్‌ పాలన ఎలా ఉందని మీ అభిప్రాయం?
తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నదీ, మీడియాలో మీరు రాస్తున్నది తేడాగానే ఉండవచ్చు. కానీ బంగారు తెలంగాణ అనే అజెండానే ధ్యేయంగా కేసీఆర్‌ ముందుకెళుతున్నారు. సాగునీరు, తాగునీరు ఇవి రెండూ ఆయన చేపట్టిన మేజర్‌ ప్రాజెక్టులు. మరో మూడు, నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయగలిగితే ప్రభుత్వానికి బొలెడు డబ్బులు వస్తాయి. మరోవైపు.. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కూడా కడుతున్నారు.

కానీ ప్రజలు ఆశిస్తున్న వేగంలో జరగటం లేదు. అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయాలి. ఇదే సమస్య. మరో విషయం.. ఏకకాలంలో కేసీఆర్‌ చాలా పెద్దభారం తలకెత్తుకున్నారు. వాటన్నింటినీ సాధిస్తారనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే నిబద్ధత ఉంది. రివ్యూ చేయగలరు, ఆలోచనలు ఉన్నాయి. ఆచరణాత్మకంగా ఆయన చాలా సింపుల్‌ మనిషి. ఒకమాటలో చెప్పాలంటే ఎన్‌సైక్లోపీడియా. ఆయనకు తెలియని సబ్జెక్టు లేదు.

రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే తెలంగాణ సాధ్యమయ్యేది కాదనడంపై మీ అభిప్రాయం?
అదేమీకాదు. 2004లో తెరాసతో పొత్తు పెట్టుకున్నప్పుడే సూత్రబద్ధంగా ప్రత్యేక తెలంగాణను అంగీకరిస్తానని వైఎస్‌ చెప్పారు. దాని సాధ్యాసాధ్యాల గురించి కూడా చాలా కండిషన్లు పెట్టారనుకోండి. కాని ప్రాథమికంగా తెలంగాణ ఇవ్వాల్సిందే అనే ఆలోచనకయితే వచ్చారాయన. పొత్తు కుదిరాక, ఎన్నికల మ్యానిఫెస్టోలోనే వర్కింగ్‌ కమిటీ తీర్మానాన్నే పెట్టాం. తెలంగాణను ఇచ్చే ప్రక్రియకు కాస్త టైమ్‌ పట్టవచ్చు కానీ కాంగ్రెస్‌ కానీ, ప్రత్యేకించి సోనియా కానీ తెలంగాణ ఇవ్వాలనే ఆలోచనతోనే ఉన్నారు.

తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్‌ తన కొంప తానే ముంచుకుంది కదా?
దానికి చాలా కారణాలున్నాయి. అది కూడా హైకమాండ్‌ చేసిన పొరపాటే. కేసీఆర్‌ను కలుపుకుని పోటీ చేసి ఉంటే 95 సీట్లు వచ్చేవి. అలాంటప్పుడు కేసీఆర్‌ను సీఎంని చేస్తే తప్పేముంది. సోనియా గాంధీతో నేరుగా ఈ విషయాన్నే చర్చించాను. కేసీఆర్‌ లీడర్‌షిప్‌ అడుగుతున్నారట కదా అని సోనియా అడిగారు. మీ మనసులో ప్రత్యేకించి పలానా వారికి ఇవ్వాలని ఫిక్స్‌ కాలేదు కదా. కేసీఆర్‌ మీతో బాగానే ఉంటాడు. తాను కాంగ్రెస్‌ సీఎంగానే ఉంటారు. తప్పేముంది అని చెప్పాను. దానికి సోనియా స్పందించలేదు. కానీ ఆమెతో అంత లోతుగా చర్చించేవాడిని.

వైఎస్సార్‌ చనిపోయాక చాలామంది ఎమ్మెల్యేలు జగన్‌కే సీఎం పదవి ఇమ్మని చెప్పినా తీర్మానం లేకుండానే రోశయ్యకు ఇచ్చారే?
అలా కాదు. వైఎస్‌ అంత్యక్రియలు పూర్తి కాకముందే పాలనకోసం తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించాల్సి ఉంది. ఆ రకంగా అన్ని పదవులు చేపట్టిన, సీనియర్‌ వ్యక్తి, అర్హత కూడా కలిగిన రోశయ్యను ఎంచుకున్నారు. అయితే ఆయన మధ్యంతర సీఎం అని చెప్పారు. అయితే ఆయను కొనసాగించాలా లేక మార్చాలా అనే విషయంపై నిర్ణయించుకోవడానికి అధిష్టానానికి ఒకటన్నర సంవత్సరం పట్టిది.

కేసీఆర్, బాబు పాలనపై మీ వ్యాఖ్య?
న్యాయంగా మాట్లాడితే నిజంగా తెలంగాణను కోరుకునే వాళ్లు ఇవ్వాళ రాష్ట్రాభివృద్ధి కోసం కేసీఆర్‌తో కలిసి కూర్చుని ఏం చేస్తే బాగుంటుందో పరస్పరం చర్చించుకోవాలి. నేను ఇంకా ప్రతిపక్షంలోనే ఉండి ఉంటే తప్పకుండా ఏది చేస్తే మంచో, కాదో కేసీఆర్‌తోనే చర్చించేవాడిని. తెలంగాణ సెంటిమెంటును అంత బలంగా ప్రతిష్టించిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి అడ్డుగోడ వద్దు. ఈ మూడేళ్లలో అగ్ర ప్రాధాన్యతలు ఎంచుకుని ఒక విజన్‌తో పనిచేస్తున్నారు కేసీఆర్‌. ఇక బాబు. తన రాష్ట్ర అభివృద్ధికోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే ఏపీలో జనం సంతోషంగా ఉన్నారా లేదా అనేది ఇప్పుడు కాదు. వచ్చే ఎన్నికల్లో తేలుతుంది.

ఓటుకు నోటు కేసులో బాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అని కేసీఆర్‌ అన్నారు. మరి బాబును ఇప్పుడు ఎవరు రక్షించారు?
ఈ కేసు విషయంలో రాజీపడ్డారన్నమాట అవాస్తవం. ఈరోజుకీ ఈ విషయంలో రెండు రాష్ట్రాల్లోనూ తిట్టుకుంటూనే ఉన్నారు కదా. పైగా ఓట్లను డబ్బుతో కొనాలనుకున్న వ్యక్తి ఇప్పుడు దెబ్బతినిపోయాడు కూడా. కేసు నడుస్తోంది. ఫలితాలకోసం చూడాలి.
(డి. శ్రీనివాస్‌తో ఇంటర్వూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/wfvLFn
https://goo.gl/RFxflM

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement