
రుణమాఫీ సాఫీగా సాగేనా?
రెండు రాష్ట్రాల పాలక నాయకులంతా చేతులు కాలిన తర్వాత ఇప్పుడు ఆకుల్ని పట్టుకుని వేలాడే పనిలో పడ్డారు!
విశ్లేషణ
ఏబీకే ప్రసాద్
రెండు రాష్ట్రాల పాలక నాయకులంతా చేతులు కాలిన తర్వాత ఇప్పుడు ఆకుల్ని పట్టుకుని వేలాడే పనిలో పడ్డారు! ఇరు ప్రాంతాల్లోనూ ముఖ్యమంత్రి పదవుల కోసం తెలుగుజాతిని విభజించడానికి గజ్జెకట్టిన దాని ఫలితాన్ని నేడు ఉభయ రాష్ట్రాల ప్రజలూ ప్రత్యక్షంగా అనుభవించాల్సి రావడం- విభజనానంతరం ఏ ఒక్క సమస్యా పరిష్కారానికి నోచుకోలేకపోవడమే నిదర్శనం. అందులో భాగమే బేషరతుగా రైతులకు చెందిన అన్ని రకాల రుణాలనూ ‘మాఫీ’ చేస్తామని ఎన్నికలలో పార్టీలు తమతమ మేనిఫెస్టోలలోనూ, నాయకులు తమ ప్రసంగాలలోనూ హామీపడ్డారు! పైగా ఏ పద్దు కింద ఎన్ని రుణాలున్నాయి, వాటి విలువెంత, రైతాంగంలోని ఏ కేటగిరీ కింద (వ్యవసాయ కార్మికులు సహా) ఎన్ని కోట్ల రూపాయలు ఈ రుణాల కింద విస్తరించి ఉన్నాయి.... ఇత్యాది లెక్కలతో చిఠా ఆవర్జాలతో నిమిత్తం లేకుండా గద్దెనెక్కాలన్న తాపత్రయంలో ఈ హామీలు కురిపిం చారు. అంటే పాలనానుభవం లేని పాలకులు, తొమ్మిదేళ్లపాటు పరిపాలన వెలగబెట్టిన పాలకులూ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైనా, అప్పుసొప్పులపైనా, రుణాల పంపిణీపైనా, ప్రజల సొ మ్ము ఎటునుంచి వచ్చి ఎటు పోతోందో కూడా ఉజ్జాయింపుగానైనా అంచనా లేకుండా వ్యవహరించబట్టే రాష్ట్రాన్ని ‘స్వర్ణాంధ్ర’గా మారుస్తానని ప్రగల్భాలు పలికి రుణాంధ్రప్రదేశ్‌గా మార్చికూర్చున్నారు!
అవగాహనారాహిత్యం
‘దృష్టికోణం’లో టీడీపీ పాలకుల్లో ఆనాడూ మార్పులేదు, ఈనాడూ లేదు. వారికి తెలిసిన మార్గం ఒక్కటే. ప్రజావ్యతిరేక సంస్కరణలకు మూలవిరాట్టయిన ప్రపంచ బ్యాంకు నుంచి అయినకాడికి రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపించడమే! అంతేగాదు, రాష్ట్రంలో రైతుల రుణాలు మొత్తం ఎన్ని ఉన్నాయో కమిటీలు చెప్పేదాకా పాలకులకు తెలియకపోవటం మరొక విశేషం. అలాగే సహకార బ్యాంకుల నుంచి, వాణిజ్య బ్యాంకుల నుంచి పంట రక్షణ కోసం, వ్యవసాయమే ఆధారంగా బతుకులీడుస్తున్న సన్నకారు, చిన్నస్థాయి మధ్యతరగతి రైతాంగం ఎంతెంత రుణం తీసుకున్నారో కూడా వారికి అవగాహన లేదు. అంతేకాకుండా ఈ రుణ పంపిణీలో పాల్గొన్న బ్యాంకులు కేవలం రైతాంగానికి ఇచ్చిన రుణాలెన్ని...సెమీ అర్బన్‌లో ఉండేవారికి, పట్టణాలు, నగరాలలోని వారికి బ్యాంకుల నుంచి ముడుతున్న రుణాలు ఎంతెంత? అన్న విషయమై కూడా ఈ పాలకులకు అవగాహన లేదు. కనుకనే శ్లేష్మంలో పడ్డ ఈగలా తీర్చలేని ఈ హామీల నుంచి బయటపడలేక కమిటీలపై కమిటీలను వేసుకుని, రైతాంగానికి ఏమేరకు ఆచరణలో ‘టోపీ’లు తొడగాలా అని చూస్తున్నారు. ఈ వరసలో వచ్చిందే ‘నాబార్డ్’ సంస్థ మాజీ చైర్మన్ పీ కోటయ్య కమిటీ నియామకం.
కాలహరణానికి ఎత్తుగడ
తొమ్మిది మంది సభ్యులున్న ఈ కమిటీలో రుణాల మాఫీపై ఒక ఏకవాక్యత లేదు. ఎందుకని? పాలకుడు అసలెంతవరకు రైతులకు రుణమాఫీ చేయగలడో కమిటీకి చెప్పడు! అది చెపితేగానీ ఏ మేరకు ఏ బాపతు రుణాన్ని సర్దుబాటు చేయగలదో కమిటీ చెప్పడానికి సిద్ధపడ్డం లేదు. పైగా కమిటీ సభ్యుల్లోనూ ఈ సంకటస్థితిపైన స్పష్టత లేదు. కాగా, సమస్యను అధ్యయనం చేయడానికి ‘మరికొంత’ సమయం కావాలని కమిటీ కోరుతోంది. అంటే ఆ సమయం టీడీపీ పాలకుడు ‘ఊపిరి’ పీల్చుకోడానికి అవసరమైన ‘కాలహరణమే’గానీ మరొకటి కాదు! ఈలోగా రుణమాఫీ పథకాలకు, రుణమాఫీకి తాము వ్యతిరేకమని, దేశ, రాష్ట్ర ఆర్థిక స్థితికి రుణమాఫీ విధానం చేటు అని రిజర్వు బ్యాంకు ఒకవైపునుంచీ.... ఆ మార్గంలోనే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కూడా ప్రకటించాయి.
రెండు ప్రాంతాలలోని కొత్త ప్రభుత్వాలనూ అవి హెచ్చరించాయి. కేవలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్ని రకాల వ్యవసాయ రుణాలు, పంట రుణాలు, డ్వాక్రా మహిళా సంఘాల రుణాల మొత్తం రూ.87,612 కోట్లుగా తేలింది. ప్రభుత్వాలుగా బ్యాంకులకు మీరు చెల్లిస్తామని మాకు రాతపూర్వకంగా హామీపడితే మాకు అభ్యంతరం లేదని ఆర్‌బీఐ ఒక చురక కూడా వేసిందని మరచిపోరాదు. ఎందుకంటే అక్కడ ‘అల్లం’ లేకుండా కోటయ్య కమిటీ కూడా చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఎంతగా కోటయ్య ‘మనవాడ’నుకున్నా గతంలో నాబార్డ్ చైర్మన్‌గా ఉన్నప్పుడు సహకార బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు తగ్గించడానికే ససేమిరా అన్న విషయం గమనార్హం.
1991లో ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత 2001, డిసెంబర్ 31 నుంచి 2002, డిసెంబర్ 31 మధ్య రాష్ట్రాల సహకార బ్యాంకుల అధికారిక గణాంకాల ప్రకారం గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్, మెట్రోపాలిటన్ నగరాల్లో బ్యాంకులకు జమపడిన డిపాజిట్లు, బ్యాంకులిచ్చిన రుణాల వృద్ధిరేటు గమనిస్తే గ్రామీణ ప్రాంతాలకూ, పట్టణ-నగర ప్రాంతాలకూ మధ్య నమోదైన వ్యత్యాసం బట్టబయలవుతుంది. బ్యాంకింగ్ రంగం 2001-2012 మధ్యకాలంలో అధికారికంగా ప్రైవేటు రంగంతోపాటు ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా పట్టణ-నగర ప్రాంతాల అవసరాలకు అధికంగా ప్రాధాన్యమివ్వసాగాయి. దీని ఫలితం ఏమైంది? గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడే రైతాంగం, వ్యవసాయాధారిత వృత్తులు, చేతివృత్తుల వారి అవసరాలకు తగిన పరపతి అందక ఈ వర్గాలు భారీ ఎత్తున నష్టాలకు గురికావల్సి వచ్చింది.
బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ ప్రవేశం వల్ల సులభతరం కావల్సిన రుణ సౌకర్యం, ప్రాధాన్యతలను తారుమారు చేసికూర్చుం ది! జనాభా ప్రాతిపదికగా చూస్తే, అఖిల భారతస్థాయిలో 2006-2010 మధ్య కమర్షియల్ బ్యాంకులు గ్రామీణ, సెమీ అర్బన్, నగరాలలో పంపిణీ చేసిన రుణాలు వడ్డీతో సహా తిరిగి బ్యాంకులకు రావలసిన మొత్తం రుణాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. 2006లో గ్రామీణ, సెమీ అర్బన్, పట్టణ, మెట్రో నగరాలలో వ్యవసాయ రుణాల బకాయిల మొత్తం రూ.1,72,683 కోట్లు ఉండగా, 2010 నాటికి ఇది రూ.3,90,297 కోట్లకు పెరిగింది.
పరపతిలో నగరాలకే ప్రాధాన్యం
బ్యాంకింగ్ వ్యవస్థలో గ్రామీణ ఆర్థిక రంగాన్ని భాగస్వామ్యం చేయకుండా వచ్చే 20 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ 9-10% అభివృద్ధి అసాధ్యమన్నది నిపుణుల అంచ నా. చివరికి 2030 నాటికి కూడా అధిక శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తారని, వీరు ఇకముందు కూడా వ్యవసాయంపైనే ఆధారపడతారని అంచనా. అందువల్ల దేశ జనాభా పోషణకు, బతుకుబాటకు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం అనివార్యమని, దానికి తగిన విధంగా వెన్నుదన్నుగా మౌలిక పరపతి సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుందని బ్యాంకింగ్, వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు.
నేడు దేశ జనాభాలో కేవలం ఆరు శాతం ఉన్న ఆరు మెట్రో నగరాలు(ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్) బ్యాంకింగ్ వ్యాపారంలో మెట్టువాటా అనుభవిస్తున్నాయి. మొత్తం డిపాజిట్లలో ఈ ఆరు మెట్రోల వాటా 2001 డిసెంబర్1 నాటికి 30% కాగా ఆ వాటా కాస్తా 2012 నాటికి 42%కు ఎదిగిపోయింది. కాగా దేశంలోని మొత్తం 53మెట్రో కేంద్రాల్లో 2001 లో అనుభవించిన రుణసౌకర్యం మొత్తం రుణాలలో 60%. 2012 డిసెంబర్ నాటికి ఇది 65%కు పెరిగింది. అంటే ఈ 53 మెట్రోలకు 2001-2012 మధ్యకాలంలో అందిన పరపతి సౌకర్యం 920% పెరిగిందని నిపుణులు నిర్ధారించారు. ఇక సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు శాఖల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశ బ్యాంకింగ్ పరిశ్రమ పరపతి వనరుల కల్పనలో గ్రామాలను, సెమీ అర్బన్ జనాభాను మాడబెట్టి అర్బన్, మెట్రో నగరాలలోని కార్పొరేట్లకు దోచిపెడుతోందని తేలింది!
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)