
కోల్ కతాలో విడుదల చేసిన నేతాజీ 'రహస్య' పత్రాలు
కాంగ్రెస్, దాని మిత్రులు అధికారాన్ని ప్రయోగించి నేతాజీ గురించిన నిజాన్ని దాచి ఉంచాలని ఎందుకు ప్రయత్నించారు? నేతాజీ కుటుంబంపై దశాబ్దాల తరబడి నిరంతర నిఘా ఎందుకు ఉంచినట్టు? ఇలాంటి ప్రశ్నలకు కాంగ్రెస్ ఎన్నడూ జవాబులు చెప్పలేదు. కాబట్టి ఊహాగానాలు అనివార్యం. సజీవంగానే ఉన్న నేతాజీని దేశానికి వెలుపలే ఉంచేయడానికి నెహ్రూ విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యాడని ప్రజల విశ్వాసం. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల ద్వారా నెహ్రూ, కాంగ్రెస్‌లను అధికారం నుంచి తప్పించగలిగిన శక్తివంతుడైన నేత నేతాజీ ఒక్కడే.
మనకు ‘నేతాజీ’గా సుపరిచితుడైన సుభాష్ చంద్రబోస్ 1945లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో మరణించినట్టు అధికారిక కథనం. ఆయనకు సమకాలీనుడైన విన్‌స్టన్ చర్చిల్ అన్నట్టు అది నేటికీ ‘‘నిగూఢతలో దాగిన అంతుబట్టని సమస్య’’గానే ఉంది. అయితే జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని ప్రథమ భారత ప్రభుత్వం నేతాజీ అక్కడికక్కడే చనిపోయాడనే కథనాన్ని సులువుగానే ఆమోదించేసింది. కానీ భారత అంతరాత్మ మాత్రం ఏడు దశాబ్దాల తర్వాత నేటికీ సందేహంతో కలత చెందుతూనే ఉంది.
ఆ అంతుబట్టని సమస్యను పరిష్కరించే దిశగా గత వారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఒక ముఖ్య చర్యను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న బోస్‌కు సంబంధించిన 64 రహస్య ఫైళ్లను విడుదల చేశారు. నాకింకా అవి అందలేదు కాబట్టి వాటిలోని విషయం గురించి వ్యాఖ్యానించడం మరీ తొందరపాటు అవుతుంది. అయితే ఈ విషయంలో పాటిస్తూ వచ్చిన నిగూఢతను గురించి చర్చించడం పూర్తి సహేతుకమే. కాంగ్రెస్, దాని మిత్రులు అధికారంపై తమకున్న పట్టును ఉపయోగించి నేతాజీ గురించిన నిజాన్ని దాచి ఉంచాలనే ప్రయత్నాన్ని ఎందుకు కొనసాగించారు? కాంగ్రెస్ నాయకత్వ పరంపర నేతాజీ కుటుంబంపై దశాబ్దాల తరబడి నిరంతర నిఘా ఎందుకు ఉంచింది? అసలు కాంగ్రెస్ ఎందుకు భయపడుతోంది?
ఇలాంటి ప్రశ్నలకు కాంగ్రెస్ ఎన్నడూ జవాబులు చెప్పలేదు. కాబట్టి ఊహాగానాలు అనివార్యం. సజీవంగానే ఉన్న నేతాజీని దేశానికి వెలుపలే ఉంచేయడానికి నెహ్రూ విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యాడని ప్రజల విశ్వాసం. అందుకు కారణాలు చాలానే ఉండొచ్చు. విస్తృత ప్రజానీకంలోని ఈ చర్చకు కారణం సంక్లిష్టమైనదేమీ కాదు. సార్వత్రిక ఎన్నికల ద్వారా నెహ్రూ, కాంగ్రెస్‌లను అధికారం నుంచి తప్పించగలిగిన శక్తివంతుడైన నేత నేతాజీ ఒక్కడే. బహుశా అది 1957 నాటికే జరిగి ఉండేది కావచ్చు. కనీసం 1962లోనైతే కచ్చితంగా జరిగి ఉండేది. ఇది ఒక ఆసక్తికరమైన ఆలోచనను రేకెత్తిస్తోంది. చైనా యుద్ధానికి ముందే 1962 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కాబట్టి నేతాజీయే ప్రధానిగా ఉండి ఉంటే చైనా, భారత్‌పై యుద్ధానికి దిగి ఉండేదేనా? అయితే అది మరొక కథ.
నేతాజీని ఉద్దేశపూర్వకంగానే దేశానికి బయట ఉంచినట్టయితే, ఆయన ఎక్కడ ఉన్నట్టు? ఆయన దాక్కుని ఉండే వారైతే కాదు. అంటే ఆయనను జైల్లో నిర్బంధించి ఉండాలి. ఎక్కడ? బెంగాల్ ఫైళ్లలో ఆ విషయంపై మనకు స్పష్టమైన సూచన దొరకొచ్చు. అయితే, 1972లో బెంగాల్ ముఖ్యమంత్రిగా సిద్ధార్థ శంకర్ రే, ప్రధానిగా ఇందిరాగాంధీ ఉండగా కాంగ్రెస్‌కు మింగుడుపడని ఓ ఫైలును నాశనం చేసేశారని బోస్ కుటుంబ సభ్యులు కొందరి కథనం. అదే నిజమైతే, భయంతో కూడిన విధేయతకు మారుపేరైన రే... ఇందిర ఆదేశానుసారమే ఆ ఆధారాన్ని ధ్వంసం చేయించి ఉండాలి.
మరో ఆధారం కూడా ఉంది. ఆశ్చర్యకరంగా ఎక్కువ మంది ఆ విషయాన్ని శ్రద్ధగా పట్టించుకుని చూడలేదు. దేశంలోని రెండు ముఖ్య కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ(ఎం), సీపీఐలతో కూడిన వామపక్షం, మమతా బెనర్జీకి ముందు రెండున్నర దశాబ్దాలకుపైగా బెంగాల్‌ను పరిపాలించింది. మార్క్సిస్టు ముఖ్యమంత్రులైన జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్యలకు సర్వాధికారాలుండేవి. వారెందుకు బోస్ ఫైళ్లను దాచేసినట్టు? కాంగ్రెస్ ముఖ్యమంత్రులంటే వారి స్వీయ ప్రయోజనాల కోసం చేశారనేది స్పష్టమే. బోస్ ఫైళ్లను బయటపెట్టకుండా సీపీఐ(ఎం)కు అడ్డుపడిందేమిటి?
బోస్ ప్రారంభించిన ఫార్వర్డ్ బ్లాక్ కూడా వామపక్ష కూటమిలో ఒక భాగస్వామి. బోస్ నిర్మించిన భారత జాతీయ సైన్యపు సుప్రసిద్ధ చిహ్నం ‘దూకుతున్న పులి’ ఆ పార్టీ జెండాపై నేటికీ ఉంది. నేతాజీ 1945లో మరణించారనే వైఖరిని ఆ పార్టీ మొదటి నుంచీ నిలకడగా తిరస్కరిస్తూనే ఉంది. కోల్‌కతాలోని బెంగాల్ ప్రభుత్వంపైనా, తనకున్న పరిమిత బలంతో ఢిల్లీలోని పార్లమెంటులోనూ అది బోస్‌కు సంబంధించిన రహస్య ఫైళ్లన్నిటినీ బహిర్గత పరచాలని ఒత్తిడి తెస్తూనే ఉంది.
అందుకు ప్రతిస్పందనగా కాంగ్రెస్, ఫార్వర్డ్ బ్లాక్‌ను విచిత్ర కాల్పనికవాదుల గుంపుగానో లేదా లెక్కలోకే రాని అసంబద్ధవాదులుగానో తీసిపారేస్తూ వస్తోంది. ఇంతకూ బోస్ విషయంలో కాంగ్రెస్‌తో కమ్యూనిస్టులు ఎందుకు కుమ్మక్కయినట్టు? మార్క్సిస్టులు ఎవరిని కాపాడుతున్నారు? మన చరిత్రలోని ఆ కలవరపరిచే ఘట్టంలో సోవియెట్ యూనియన్ పాత్ర బయటపడకుండా వారు కాపాడుతున్నారా? నేతాజీకి సంబంధించిన సమాచారాన్ని నెహ్రూ ప్రభుత్వ గూఢచార సంస్థ (ఇంటెలిజెన్స్ బ్యూరో) బ్రిటన్ గూఢచార సంస్థలతో పంచుకునేదనే విషయం మనకు తెలిసిందే. దీనర్థం 1945 తర్వాత బోస్ బ్రిటన్‌కు బందీగా ఉన్నారనా? కాదు. ప్రజాస్వామిక దేశమైన బ్రిటన్‌లోని చట్టాలు బోస్‌ను విచారించక తప్పని పరిస్థితిని అక్కడి ప్రభుత్వానికి కల్పించి ఉండేవి. కాబట్టి నెహ్రూ బ్రిటిష్ వారికి బోస్ విషయాలను తెలియపరుస్తూ ఉండేవారని మాత్రమే బహుశా ఆ గూఢచార సమాచార మార్పిడి సూచిస్తుండి ఉండాలి.
నేతాజీ అమెరికా అధీనంలోకి వచ్చిన జపాన్‌లో ఉండి ఉంటారనడానికి వీల్లేదు. 1948లో అధికారంలోకి వచ్చిన చైర్మన్ మావో జెడాంగ్ బ్రిటన్‌కు అనుకూలంగా వారు చెప్పినట్టు ఆటలాడి ఉండరు. కాబట్టి చైనాలోనూ ఉండి ఉండరు. మరి నేతాజీ, సజీవుడై ఉండగా ఎక్కడున్నట్టు? సమాధానం బహుశా ఇంకా తెలిసి ఉండదు. కానీ ప్రశ్నలు మాత్రం కావాల్సినన్ని ఉన్నాయి. నేతాజీ, స్టాలిన్ రష్యాలో బందీగా ఉండి ఉంటారా? అధికారికంగా సీపీఐ(ఎం) ఇంకా స్టాలినిస్టు పార్టీగానే ఉంది. ఈ అంశంపై దేశంలో మిగతా మరెక్కడికన్నా బెంగాల్లోనే ఉద్వేగోద్రేకాలు ఎక్కువగా ఉన్నాయి. మార్క్సిస్టులు బతికి బట్టకట్టాలంటే తిరిగి పుంజుకోవాల్సింది బెంగాల్‌లోనే. అయినా బోస్ ఫైళ్లపై ప్రస్తుతం జరుగుతున్న టెలివిజన్ చర్చల్లో మార్క్సిస్టులు ఎక్కడా కనబడకపోవడం గమనార్హం.
ఇలాంటి సందిగ్ధ స్థితిలో కాంగ్రెస్‌లాగా అసందర్భ ప్రలాపాలకు దిగడం కంటే సీపీఐ(ఎం)లాగా మౌనం వహించడమే మరింత మెరుగైన వ్యూహం అవుతుంది. దిగ్భ్రాంతికరమైన మాటల గారడీతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒకరు చాలా ఏళ్లపాటూ నేతాజీ కుటుంబంపై మన గూఢచార విభాగం ఉంచిన తీవ్ర నిఘా, ఏడు దశాబ్దాలుగా ఆ పార్టీ అనుసరిస్తూ వచ్చిన రెండు నాల్కల వైఖరి మొత్తమంతా కలసి ఒట్టి ‘‘నిఘా’’ మాత్రమే తప్ప గూఢచర్యం కాదని సెలవిచ్చారు. ఇలాంటి వెర్రిమొర్రి పద విన్యాసాలకు కాలం చెల్లిపోయింది. నేతాజీ ‘రహస్య’ పత్రాలలో ఇంకా కావలసినంత నిప్పు మిగిలే ఉంది. అది ఎవరినోగానీ దహించక మానదు.
(వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి)
- ఎం.జె. అక్బర్
సీనియర్ సంపాదకులు