సేద్యంతోనే దేశ భవిత సాధ్యం
సేద్యంతోనే దేశ భవిత సాధ్యం
Published Fri, Nov 22 2013 12:22 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
నేటి యువత వ్యవసాయాన్ని ఒక ఉపాధిగా చూడటం మాట అటుంచి, అన్నదాత దీనావస్థను దృష్టిలో ఉంచుకుని కాబోలు, ఆ వైపు చూడ్డానికి కూడా సాహసిం చడంలేదు. మరోవైపు వ్యవసాయం ఏ మాత్రం లాభసాటి కాదనీ, ఇంకా నమ్ముకుంటే జీవితాలు కునారిల్లి పోతాయనీ రైతాంగం కూడా నిర్ధారణకు వచ్చేసిన సమయం ఇది. ఇంకా, వ్యవసాయం తప్ప ఏ ఇతర వృత్తి అయినా ఫరవాలే దనే భావనను పిల్లలకు కలిగిస్తున్నారు. వ్యవసాయదారు లకు సాంఘిక మర్యాద లోపించిందన్న అభిప్రాయమూ ఉంది. ఈ పరిణామం రాబోయే తరాల మీద ప్రభావం చూపించి, భయానక సాంఘిక సమస్యగా మారుతుంది. వ్యవసాయాన్ని గాడిలో పెడితే మంచి అవకాశాలను కల్పించడమేకాక, సాంఘిక స్థాయిని తెచ్చిపెట్టే వ్యవస్థ కాగలదు. చేయవలసినదల్లా యువతను ఈ రంగం వైపు తిరిగి ఆకర్షింపచేయడానికి కావలసిన వనరులను అందు బాటులోకి తీసుకురావడమే. ఆధునిక యాంత్రీకరణతో ఎద్దులూ, దున్నపోతులతో దున్నవలసిన అవసరం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటోడ్చనక్కర లేదు. మంచి వ్యవసాయవేత్త అధిక ఫలసాయం పొందడా నికి అతి తక్కువ ప్రయాసతో, ముందస్తు సాంకేతిక సల హాలతో ప్రణాళికలు తయారు చేసుకుంటాడు.
ట్రాక్టర్ దగ్గర నుంచి...
ట్రాక్టర్ ప్రవేశంతో 20వ శతాబ్దపు వ్యవసాయంలో నిజమై న యాంత్రీకరణ మొదలైంది. చైన్ రంపాలు, ట్రిమ్మర్ల దగ్గర నుంచి ఎన్నో అధునాతన యంత్రాలు ప్రపంచ వ్యాప్తంగా పొలాలలో ప్రవేశించాయి. ఆధునిక యుగంలో కంప్యూటర్‌తో పనిచేసే యంత్రాలు, గ్లోబల్ పొజిషనిం గ్‌తో పర్యవేక్షించగల వ్యవస్థలు, మానవ ప్రమేయం లేకుండా సమర్థంగా పనులు చేపట్టగల వ్యవస్థలు వచ్చా యి. నానో టెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్‌ల ద్వారా పూర్వం సాధ్యపడని అనేక పంటల్లో హైబ్రిడ్ విధానాలను అనుసంధానం చేసుకుంటూ పంటల అభివృద్ధి జరుగు తోంది. ఆరోగ్య సమస్యలు అధికమైన నేపథ్యంలో సేంద్రీ య పంటలు, కూరగాయలు, పండ్లకు గిరాకీ పెరిగింది. శాస్త్రీయ పురోగమనంతో పర్యావరణ అనుకూల ఎరు వులు, చీడపీడల నివారణ మందులు, హార్మోనులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫుడ్ ప్రోసెసింగ్, రేడియేషన్ లేకుండా చేపట్టగలిగే సశాస్త్రీయ పద్ధతులు వచ్చాయి. జన్యుమార్పిడి ద్వారా చీడపీడలను తట్టుకునే సామర్థ్యం తోపాటు, పోషక విలువలు అధికంగా ఉన్న వంగడాల రూపకల్పన వంటి అధునాతన పద్ధతులు వాడుకలోకి వచ్చాయి. ప్రస్తుత సాంకేతికయుగంలో కూడా అధిక పాలను ఉత్పత్తి చేసే హైబ్రిడ్ పాడి పశువులు అందుబాటు లోకి వచ్చాయి.
సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని గాడిలో పెట్టా లన్నా, ఆహార, ఆర్థిక భద్రతలకు ప్రమాదం సంభవించ కుండా అరికట్టాలన్నా యువత తక్షణం వ్యవసాయం వైపు చూడాలి. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దినదినా భివృద్ధి చెందుతున్న తరుణమిది. ఈ తరుణంలో కాస్త చదువు లేకుండా వ్యవసాయం చేయడం, అందులో కొన సాగడం కష్టం. కానీ, ఆధునిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకుని, వాడుకలోకి తీసుకొచ్చి, లాభపడగల ధైర్యం, తెగువ ఈనాటి చదువుకున్న యువతలో ఉన్నాయి. చదువుకున్న యువరైతుకు సామాజిక హోదాతో పాటు, తన మీద తనకు నమ్మకం ఉంటుంది. సామాజిక గుర్తింపు తనకున్న అధికారాలను ఉపయోగించుకునే చొరవను ఇస్తుంది. హక్కులను సాధించుకునే స్థాయి లభిస్తుంది. మోసానికి గురికాడు. పంటకు రావలసిన ధరను వసూలు చేసుకోగల ధైర్యం లభిస్తుంది.
ఆహార భద్రత కోసం
నిజమైన ఆహార భద్రత సాధ్యం కావాలంటే వ్యవసాయం లో యువత మళ్లీ కీలకపాత్ర పోషించాలి. ప్రస్తుతం వయో భారంతో ఉన్న రైతులే ప్రధానంగా వ్యవసాయం చేస్తు న్నారు. కానీ ప్రస్తుత తరుణంలో యువతను వ్యవ సాయం వైపు మరల్చడం, ప్రేరేపించడం అంత సులభం కాదు. కానీ,ప్రపంచ పరిణామాలు చూశాక అనేక రం గాల్లో అపారమైన తెలివితేటలు ప్రదర్శిస్తున్న మన యువ తను ఆ వైపుగా నడిపించే లక్ష్యాన్ని సుసాధ్యం చేయవచ్చు నని అనిపిస్తుంది. మొదట ఉన్నత పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో వ్యవసాయం మీద అవగాహన కల్పించాలి. అమెరికాలో ఉన్నత పాఠశాల స్థాయిలోనే వ్యవసాయ పరి జ్ఞానాన్ని పాఠ్యాంశంగా బోధించడం ఎప్పుడో ఆరంభ మైంది. ఇటువంటి ప్రయోగాలతో ఆ దేశం యువతలో భావోద్వేగాలను రేకెత్తించి, వ్యవసాయోత్పత్తుల పెంపును సాధించారు. యువతను వ్యవసాయ రంగంలో సుస్థిరత తో, అంకితభావంతో ఉండేటట్టు చేయగలుగుతున్నారు.
పాఠ్యాంశంగా సేద్యం
ఉన్నత పాఠశాల స్థాయిలోనే వ్యవసాయం గురించి బోధించి అభివృద్ధి చెందిన దేశాలు మెరుగైన ఫలితాలు సాధించాయి. విస్కాన్సన్ విశ్వవిద్యాలయం సహకారంతో ప్రయోగాల గురించిన ప్రత్యేక వ్యవసాయ పాఠ్యాంశాల సంపుటిని అమెరికా వెలువరించింది. ప్రత్యేక సిబ్బందిని నియమించి పాఠాలను దేశమంతా బోధించే ఏర్పాటు కూడా ఆ దేశం చేసింది. ఇదంతా ఆషామాషీగా జరగ లేదు. ఉన్నత పాఠశాలల కోసం రూపొందించిన సుస్థిర వ్యవసాయ విద్యాబోధనల మీద మొదట అయోవా స్టేట్ యూనివర్సిటీలో లోతైన అధ్యయనం జరిపారు. ఆపై అమలు గురించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అధ్యయ నంతో విలువైన ఫలితాలను కూడా సాధించారు. వ్యవసా యాభివృద్ధికి కావలసిన ఐదు అంశాల్లో సుస్థిర వ్యవ సాయ విధానం ముఖ్యమైనదిగా అమెరికా పౌరులు భావి స్తున్నారని ఈ అధ్యయనంతో తెలిసింది. ఇప్పుడున్న అన్న దాతలతో పాటు వ్యవసాయం మీద ఆధారపడిన ఇతరు లకు కూడా ఈ రంగం లాభసాటి కాగలదని ఆ అధ్యయ నంలో తేలింది.
ఇక్కడా ప్రారంభం కావాలి
ఇక్కడ ఉన్నత పాఠశాల పాఠ్యాంశాలలో వ్యవసాయం అనే అంశానికి ఆచరణ యోగ్యమైన పాఠ్యాంశాలు, అభ్యా సాలు లేవు. కాబట్టి ప్రభుత్వాలు చొరవ చూపించి అలాం టి పాఠ్యాంశాలను నిపుణులతో తయారు చేయించి చేర్చా లి. మన ఆహారం ఎక్కడ నుంచి వస్తుందో కూడా తెలి యని పరిస్థితుల్లో ఉన్న మన యువతను, వైట్ కాలర్ చదువు, ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్న యువతను తట్టి లేపడం జాతీయ ప్రయోజనాల రీత్యా అత్యవసరం. వ్యవసాయం గురించి చెప్పే పాఠ్యాంశాలు కొన్ని విద్యాల యాల్లో ఐచ్ఛికాంశాలే. అది కూడా నిరాసక్తంగా బోధిస్తు న్నారు. కానీ వాటినే ప్రధానమైన పాఠ్యాంశాలుగా మార్చి, సాహసోపేతమైన వాణిజ్య అంశాలను, అపారమైన పారి శ్రామిక అవకాశాలను గురించి విద్యార్థులకు బోధించాలి.
నిజానికి ఇదంతా ఈపాటికే జరిగి ఉండాలి. సుస్థిర వ్యవసాయ విధానాలకు నాంది పలికి విద్యార్థి లోకాన్ని ఆ వైపుగా నడిపించి ఉండాలి. ఇప్పటికైనా వ్యవసాయం పట్ల అగమ్యగోచరంలో కొట్టుమిట్టాడుతున్న సమాజంలో ఉత్సాహాన్ని కలిగించేలా యువరక్తాన్ని కదిలించాలి. వ్యవ సాయమంటే ప్రాణికోటికి ఆహారం అందించే వ్యవస్థగా, ఐటీ, ఉత్పత్తి రంగాలను మించి ఆదాయాన్ని ఇవ్వగల పరి శ్రమగా చూడగలిగేలా చేయాలి. దీనికి కొంత సమయం పట్టవచ్చు. అయితే ఇది సాధ్యమేనని ప్రపంచ దేశాలు చాటి చెప్పాయి. ఇందులో సఫలమైన పారిశ్రామికవేత్త లను, విద్యార్థులను ఒకచోట చేర్చాలి. విజయగాథలపై చర్చించేటట్టు చేయాలి. కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్‌లో ఉన్న నైపుణ్యాలను తమ వృత్తికి కావలసిన విధంగా మలుచు కునేలా యువతను తీర్చిదిద్దడం కష్టమైన పనేమీ కాదు.
ఏ విధంగా చూసినా...
మన యువత అత్యధిక శాతం ఆకలి, పేదరికం, అనారో గ్యం, అవిద్య వంటి సమస్యలతో వారి శక్తి సామర్థ్యాలను వినియోగించుకోలేకపోతున్నది. చిన్నాచితకా ఉద్యోగాల వేటలో పడి అవి కూడా దొరకని సందర్భాల్లో కొంత మం ది నేరాలకు పాల్పడుతున్నారు. ఆధునిక సాంకేతిక పరి జ్ఞానం అందుబాటులో ఉన్న ప్రస్తుత కాలంలో యువత తమకు సవాలుగా ఉన్న వ్యవసాయం లాంటి రంగాల్లో ప్రభుత్వ సహకారం, విధానాల మార్పుల ద్వారా తమ కలలను సాకారం చేసుకోగలరు. మరో ఏడేళ్లలో దేశ జనా భాలో 64 శాతం యువతరమే ఉంటుంది. ఈ అంశాన్ని పాలకులు గుర్తిస్తే దేశానికి, దాని ఆర్థిక ఆరోగ్యానికి నిజ మైన వాతావరణాన్ని సృష్టించిన వారవుతారు.
- డా॥బలిజేపల్లి శరత్‌బాబు
ప్రధాన శాస్త్రవేత్త
నేషనల్ బ్యూరో ఆఫ్
ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్
హైదరాబాద్
Advertisement
Advertisement