జవాబు పత్రాలు తండ్రికివ్వరా? | supreme supports vijaykumar misras over demanding sun answersheet appeal | Sakshi
Sakshi News home page

జవాబు పత్రాలు తండ్రికివ్వరా?

Published Fri, Dec 4 2015 7:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

జవాబు పత్రాలు తండ్రికివ్వరా?

విశ్లేషణ
 ఒక తండ్రి విజయ్ కుమార్ మిశ్రా తన కుమారుడు (కేంద్ర ద్వితీయ స్థాయి విద్యామండలి) సీబీఎస్‌ఈ నిర్వహించిన 12వ తరగతి లెక్కలు, విజ్ఞాన శాస్త్రం పరీక్షలలో రాసిన జవాబుపత్రాల ప్రతులను ఇమ్మని సమాచార హక్కు చట్టం కింద కోరారు. తమ నియమాల ప్రకారం పరీక్ష రాసిన కొడుకే పత్రాలు అడగాలి కాని ఆయన తండ్రి అడగడానికి వీల్లేదనీ కనుక ఇవ్వబోమని సీబీఎస్‌ఈ పట్టుపట్టింది. పరీక్ష రాసిన విద్యార్థులకు జవాబు పత్రాల సమాచారం ఇవ్వబోనని సుప్రీంకోర్టు దాకా సీబీఎస్‌ఈ పోరాడింది. 2011లో ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం జవాబు పత్రాలు ఇచ్చితీరాలని సీబీఎస్‌ఈని ఆదేశించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జవాబు పత్రాలు ఇవ్వకూడదని, ఈ విషయంలో ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1) (ఇ) ఇచ్చిన మినహాయింపు తమకు వర్తిస్తుందని సీబీఎస్‌ఈ చేసిన వాదనలన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టి పారేసింది.

 పరోక్షంగా అనేకానేక ప్రతిబంధకాలు కల్పించి జవాబు పత్రాల సమాచారం నిరాకరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. విజయ్ కుమార్ మిశ్రాను కూడా ఈ విధంగానే వేధించారు. రెండో అప్పీలులో కమిషన్‌కు రాక తప్పలేదు.  తమ నియమాల ప్రకారం చివరి తేదీ దాటిన తరవాత దరఖాస్తు వచ్చిందని, అభ్యర్థి కాకుండా అతని తండ్రి అడిగాడు కనుక ఇవ్వబోమని సీబీఎస్‌ఈ వాదించింది. సంతకం పరిశీలించి అడ్మిట్ కార్డు దరఖాస్తులో ఒక సంతకం ఉంటేనే ఇస్తామని, కానీ మరెవరో సంతకం చేస్తే ఇవ్వబోమని చెప్పింది.  

ఫలి తాలు ప్రకటించిన పది రోజుల్లో మాత్రమే అడగాలని, దానికి తగిన రుసుము అనుబంధాలు ఇస్తేనే జవాబు కాపీలు ఇస్తామన్నారు. సొంతంగా అభ్యర్థి తన దస్తూరీతో అండర్ టేకింగ్ ఇవ్వాలి. సంతకాల్లో మార్పు ఉండరాదు. పరీక్షించిన అధికారిని సవాలు చేయడానికి వీల్లేదు. కూడికలో తప్పులు విద్యార్థి మాత్రమే పది రోజుల్లో ఎత్తిచూపాలి. మళ్లీ జవాబులు పరిశీలించాలని కోరడానికి వీల్లేదు. పరీక్షించిన అధికారి పేరును కనిపిం చకుండా చేస్తారు. ఆ విధంగా తీసుకున్న జవాబు పత్రా లను ప్రదర్శించడానికి గాను ఏ సంస్థకూ ఇవ్వకూడదు, వార్తాపత్రికలకు ఇవ్వకూడదు, వాణిజ్య అవసరాలకు వాడుకోకూడదు.  ఆ విధంగా చేయబోనని ఒక వాగ్దాన పత్రం (అండర్ టేకింగ్)పైన సంతకం చేయాలి. అప్పు డు మాత్రమే జవాబు పత్రాలు ఇస్తామని, లేకపోతే లేదని వాదించారు.

 జవాబు పత్రాలు కోరిన సమయంలో సీబీఎస్‌ఈ వద్ద ఆ పత్రాలు ఉంటే వాటిని నిరాకరించడానికి సెక్షన్ 8, 9 కింద మినహాయింపులు వర్తిస్తాయా లేదా అని మాత్రమే పరిశీలించాలి. జవాబు పత్రాల ప్రతులను తయారు చేసే ఖర్చును తీసుకోవాలి. అదీ ఆర్టీఐ నియ మాల ప్రకారమే. జవాబులు పునఃపరిశీలించాలని కోరే హక్కు వదులుకుంటేనే ఇస్తామని, జవాబులు ఎవ్వరికీ చూపబోమని, వాణిజ్య ప్రయోజనాలకు వాడు కోబో మని, ప్రింట్ మీడియాకు ఇవ్వబోమని వాగ్దాన పత్రాలపైన సంతకాలు చేయాలనడం, హక్కులు వాడు కోకుండా ఒత్తిడి చేయడం అవుతుందని, ఇందువల్ల ఆ షరతులన్నీ అసమంజసమైన షరతులనీ, సమాచార హక్కును నిరాకరించడానికి కల్పించిన చట్టవ్యతిరేక పరిస్థితులని కమిషన్ భావించింది. పునః మూల్యాంకనం చేయాలని కోరే హక్కు సహజంగా పరీక్ష రాసిన విద్యార్థికి లభిస్తుంది.
కేవలం జవాబు పత్రాన్ని అడిగిన విద్యార్థి ఆ హక్కును వదులుకోవాలని ఒత్తిడి చేయడం ప్రభుత్వ సంస్థకు న్యాయం కాదు. ఒకవేళ అత్యుత్తమ జవాబు పత్రమైతే, ఆ విద్యార్థి తన జవాబు పత్రాన్ని ఇతరులకు ఎందుకు చూపగూడదు? ఆ విద్యార్థికి పాఠాలు  చెప్పిన విద్యా సంస్థ  ఆ జవాబు పత్రాన్ని గ్రంథాలయంలో ఎందుకు పెట్టగూడదు? మంచి జవాబు రాసినా మార్కులు ఇవ్వకపోతే సీబీఎస్‌ఈని ఎందుకు విమర్శించకూడదు? అసలు సమాచారం కోరేదే అవసరమైతే వినియోగించడానికి. ఏ విధం గానూ వినియోగించకూడదని షరతులు పెట్టే అధికారం సీబీఎస్‌ఈకి ఎవరిచ్చారు? మీడియాకు ఇవ్వకూడదని షరతు విధించడం రాజ్యాంగం ఆర్టికల్ 19 (1)(ఎ) కింద పౌరులకు ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రాన్ని, అభివ్యక్తి స్వాతంత్య్రాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.

 అభ్యర్థి తండ్రికి తన కుమారుడి జవాబు పత్రాలు కోరే హక్కు లేదా? అభ్యర్థి మైనర్ బాలకుడే అవుతాడు కనుక అతని సహజ సంరక్షకుడైన తండ్రికి తనయుడి తరపున చట్టపరమైన అన్ని హక్కులు కోరే అధికారం ఉంటుందని చట్టాలు వివరిస్తున్నప్పుడు ఆ హక్కులను నిరాకరించే అధికారం సీబీఎస్‌ఈకి ఎవరిచ్చారు? సహజ సంరక్షకుడి హోదాలో తండ్రికి తన కుమారుడి విద్యా ప్రయోజనాలను రక్షించే అధికారం ఉండి తీరు తుంది. ఒకవేళ తన కొడుకు జవాబు పత్రాలను సరిగ్గా మూల్యాంకనం చేయలేదని ఆయన అనుమానిస్తే ఆ పరిస్థితిని సవరించి న్యాయం కోరే అధికారం తండ్రికి ఉంది. కుమారుడి జవాబు పత్రాలు ఇవ్వడానికి నిరాకరించడం చట్టవ్యతిరేకం. అసమంజసమైన షరతులు విధించడం ద్వారా అభ్యర్థి సమాచార హక్కును పరిమితం చేయడానికి వీల్లేదు. ఈ విధంగా వేధించినందుకు 25 వేల రూపా యల పరిహారం చెల్లించాలంటూ జరిమానా ఎందుకు విధించకూడదో వివరించాలని కమిషన్ ఆదేశించింది.

 (విజయకుమార్ మిశ్రా వర్సెస్ సీబీఎస్‌ఈ పాట్నా,  CIC/RM/A/2014/0000014-SA లో డిసెంబర్ 3న నా తీర్పు ఆధారంగా)

http://img.sakshi.net/images/cms/2015-05/51431028391_160x120.jpg
 (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్: మాడభూషి శ్రీధర్)
 professorsridhar@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement