బడ్జెట్ భారం, కేంద్రం దూరం | The burden on the budget, the distance to the center | Sakshi
Sakshi News home page

బడ్జెట్ భారం, కేంద్రం దూరం

Published Wed, Nov 12 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

బడ్జెట్ భారం, కేంద్రం దూరం

బడ్జెట్ భారం, కేంద్రం దూరం

తెలంగాణ  ప్రభుత్వం మూడు మార్గాల ద్వారా బడ్జెట్‌కు నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మొదటిది అప్పులు తెచ్చుకోవడం. రెండవది భూములు అమ్ముకోవడం.  మూడవది కేంద్రం నుండి సహాయం పొందడం. ఈ అంచనాలన్నీ అత్యాశగానే కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఈ మూడు అంశాలలో అప్పులు ఎక్కడి నుండి తెస్తారు, వాటిని తిరిగి చెల్లించే మార్గాలు ఏమిటి? మళ్లీ  ప్రపంచ బ్యాంకు వంటి రుణ వ్యవస్థలకు తెలంగాణ  ప్రజలను తాకట్టు పెడతారా అన్న విషయాలు రానున్న కాలంలో ఎట్లాగూ తెలుస్తాయి.
 
డేట్‌లైన్ హైదరాబాద్

 
తెలంగాణ   శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఈ నెల ఐదో తేదీన సమావేశాల మొదటి రోజునే రూ. లక్ష కోట్ల పైచిలుకు బడ్జెట్‌ను రాష్ర్ట ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ సభలో ప్రవేశపెట్టారు. రాష్ర్ట విభజన అనంతరం జూన్ 2న అపాయింటెడ్ డే నుండి తెలంగాణ  రాష్ర్టం అస్తిత్వంలోకి వచ్చింది. ఆ రోజునే  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వాన కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి దాకా తెలంగాణ  రాష్ర్టంలో భాగమైన పది జిల్లాలూ గవర్నర్ పాలన కిందనే ఉన్నాయి. ఆ కొద్దిమాసాల బడ్జెట్‌కు గవర్నర్ ఆధ్వర్యంలోనే కేటాయింపులు జరిగాయి. ఇప్పుడు తెలంగాణ  తొలి ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ 2014 జూన్ నుండి అంటే 10 మాసాలకు ఉద్దేశించింది. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టింది నవంబర్ 5 వ తేదీన. అంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గడిచిపోయిన 5 మాసాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలినవి 5 మాసాలే.

నిధులకు మూడు మార్గాలు

ఉమ్మడి రాష్ర్టంగా ఉన్ననాడే ఆంధ్రప్రదేశ్ చివరి బడ్జెట్ లక్షా 61 వేల కోట్లు. 2013లో ఉమ్మడి రాష్ర్ట చివరి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు రాష్ర్టం విడిపోయాక అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ  ప్రభుత్వం చెరి లక్ష కోట్ల పైచిలుకు బడ్జెట్‌లు ప్రవేశపెట్టాయి. రెండు ప్రభుత్వాలూ బడ్జెట్ వ్యవహారంలో ప్రతిష్టకు పోయి, నేల విడిచి సాము చేస్తున్నాయన్న విమర్శనే ఎదుర్కొంటున్నాయి.  ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం తొందరగానే బడ్జెట్ సమావేశాలు ముగిం చుకున్నది. ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్లకుండా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం.

తెలంగాణ  ప్రభుత్వం మూడు మార్గాల ద్వారా బడ్జెట్‌కు నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మొదటిది అప్పులు తెచ్చుకోవడం. రెండవది భూములు అమ్ముకోవడం. మూడవది కేంద్రం నుండి సహాయం పొందడం. ఈ అంచనాలన్నీ అత్యాశగానే కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఈ మూడు అంశాలలో అప్పులు ఎక్కడి నుండి తెస్తారు, వాటిని తిరిగి చెల్లించే మార్గాలు ఏమిటి? మళ్లీ ప్రపంచ బ్యాంకు వంటి రుణ వ్యవస్థలకు తెలంగాణ  ప్రజలను తాకట్టు పెడతారా అన్న విషయాలు రానున్న కాలంలో ఎట్లాగూ తెలుస్తాయి.  రెండవ అంశం భూముల విక్రయం. వచ్చే నాలుగు మాసాల కాలంలోనే భూముల విక్రయం ద్వారా రూ.6,500 కోట్లు సముపార్జించే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది.  ఆచరణలో అది అంత సులభం కాదన్న విషయం ప్రభుత్వానికి తెలియనిది కాదు. సుదీర్ఘకాలం తెలంగాణ  రాష్ర్ట సాధన కోసం ఉద్యమం జరిగిన నేపథ్యంలో భూముల క్రయవిక్రయాలు దారుణంగా పడిపోయిన విషయం కూడా ప్రభుత్వానికి తెలుసు. సరే, అది అట్లా ఉంచితే, మూడవ అంశం కేంద్ర సహాయం.

కేంద్రం నుండి వీలైనంత ఎక్కువ సహాయం రాబట్టుకోవాలనే సంకల్పం నిజంగా తెలంగాణ  ప్రభుత్వానికి ఉన్నదా అన్న సందేహం అందరికీ కలుగుతున్నది. ప్రభుత్వాల నిర్వహణ చాలా సందర్భాలలో రాజకీయ సమీకరణలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ నిమిషానికి అయితే రాష్ర్టంలో అధికారంలో ఉన్న తెలంగాణ  రాష్ర్ట సమితికీ,  కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకీ మధ్య సంబంధాలు అస్సలు బాగా లేవు.  లేకపోగా రోజురోజుకూ రెండు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా పరిస్థితి తయారవుతోంది.

కేంద్ర సాయం ఏ మేరకు సాధ్యం?

పక్క రాష్ర్టం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నది. అట్లాగే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం కూడా చేరింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో ఇక్కడా అక్కడా ఆ రెండు పార్టీలు కలసి పోటీ చేశాయి. అటువంటి చోటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రాజకీయ స్నేహం ఏ మేరకు తన రాష్ట్రానికి ఉపయోగపడుతుందో చెప్పే స్థితిలోలేరు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనూ ఆయనకు అత్యంత సన్నిహితుడిగా, ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో అత్యంత కీలక స్థానంలో ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడుతోనూ తమ స్నేహం వల్ల ఏ మేరకు లబ్ధి కలుగుతుందో చంద్రబాబు నాయుడు చెప్పే స్థితిలో లేరు. సంకీర్ణ ధర్మం వేరు, రాజకీయంగా బలపడటం వేరు అన్న సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అమలు చేయడం మొదలు పెట్టిన బీజేపీ అక్కడ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పావులు కదపడం మొదలుపెట్టింది. రాష్ర్ట విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మట్టి కొట్టుకు పోవడంతో ఆ పార్టీలో అంతో ఇంతో బలం ఉన్న నాయకుల ను తన పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టేసింది. ఈ విషయంలో గత అనుభవాల నుండి బీజేపీ పాఠం నేర్చుకున్నదనే భావించాలి. 1999-2004 మధ్య కాలంలో ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశంతో కలసి నడిచిన ఫలి తంగా బీజేపీ రాజకీయంగా ఎంత బలహీనపడిందో ఆ పార్టీకి అర్థం అయినట్టే ఉంది. నరేంద్ర మోదీ, అమిత్ షాల జోడీ వ్యూహాలు  మనం ఇటీవలే మహారాష్ర్ట ఎన్నికలలో కూడా చూశాం. భావ సారూప్యం కలిగిన శివసేనతోనే 25 సంవత్సరాల అనుబంధాన్ని తెంచుకోగలిగిన బీజేపీకి తెలుగుదేశం ఒక లెక్క కాదు కదా!

ఈ వైఖరితో ఏం సాధిస్తారు?

అటువంటి మోదీ, షా జోడీ తెలంగాణలో టీఆర్‌ఎస్ పట్ల ఎటువంటి వైఖరి తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు పట్ల ముఖ్యంగా తెలంగాణ   ఏర్పాటు పట్ల కచ్చితమైన ైవైఖరితో నిలిచిన బీజేపీ విషయంలో టీఆర్‌ఎస్ అధినేత అనుసరిస్తున్న ధోరణి తన పార్టీని రాజకీయంగా బలోపేతం చేసుకోవడానికే అయినా, నూతనంగా ఏర్పడిన తెలంగాణ  రాష్ర్ట ప్రయోజ నాలకు మాత్రం ఉపయోగకరం కాదు. మహారాష్ర్ట గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్‌రావు గారికి తెలంగాణ  ప్రభుత్వం మొన్న ఘనంగా పౌర సన్మానం నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు. గౌరవనీయులైన మహారాష్ర్ట గవర్నర్ తెలంగాణ  విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలను ఒప్పించేందుకు చేసిన కృషిని కేసీఆర్ కొనియాడారు. మొన్న ఆదివారం నాడు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించిన మరో సీనియర్ బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయను కూడా ఉచితరీతిన సత్కరించుకుంటామని ఆయన ఇదే వేదిక మీద చెప్పారు. చంద్రశేఖర్‌రావు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందించాల్సిందే. ఆ ఇద్దరు నేతలు తెలంగాణలో అంత కంటే ఎక్కువ సత్కారానికీ అర్హులే.  

రాష్ట్రానికి మేలు చేయని వైరం

కానీ జూన్ 2న తన ప్రమాణ స్వీకారానికి మాత్రం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రావడానికి  సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ర్ట నాయకులు కోరినా కేసీఆర్ పట్టించుకోలేదట. తెలంగాణ  రాష్ర్టం ఇచ్చి ఆంధ్ర ప్రాంతంలో నేల కరిచి కూడా తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్, ఆంధ్ర ప్రాంత నాయకుడి కనుసన్నల్లో మెలగుతున్నారన్న దాడి ఎదుర్కొంటున్న తెలంగాణ  టీడీపీ కంటే కూడా బీజేపీకే ఇక్కడ బలపడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్న విశ్లేషకుల అభిప్రాయాన్ని కొట్టి పారెయ్య డానికి వీల్లేదు. తెలంగాణలో మరెవ్వరికీ ఎటువంటి స్థానం ఉండకూడదు అన్న ఈ ధోరణి టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా ఏ మేరకు లాభం చేకూరుస్తుందో తెలి యదు కానీ ప్రస్తుతం అయితే రాష్ర్ట ప్రయోజనాలకు ఏ మాత్రం మేలు చెయ్య దన్న విషయం ఆయన గుర్తిస్తే మంచిది.    
 http://img.sakshi.net/images/cms/2014-11/61415731881_Unknown.jpgదేవులపల్లి అమర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement