అగ్రస్థానాల్లో ఆ నలుగురూ..!
సందర్భం
ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యంలేని నలుగురు నేతలు కోవింద్, వెంకయ్య, నరేంద్ర మోదీ, సుమిత్రా మహాజన్ నేడు నాలుగు అత్యున్నత రాజ్యాంగ పదవులను అలంకరించడం బీజేపీ చరిత్రలో మేలిమలుపు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంచుకోటలు మోదీ, షా నాయకత్వంలో బీటలువారాయి. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నిలిస్తే... కమ్యూనిస్టులు తొలి సారిగా బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యాన్ని కోల్పోయిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. మరోవైపు దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీకి నేతృత్వం వహించిన నలుగురు సామాన్యులు దేశ అత్యున్నత పీఠాలను అధిరోహిస్తున్నారు.
కాంగ్రెస్ ముక్తి భారత్ అంటున్న బీజేపీ ఇప్పుడు ఆ దిశగా తొలి అడుగు వేసిందని చెప్పవచ్చు. తొలిసారి నాలుగు అగ్ర స్థానాల్లో నలుగురు బీజేపీ నేతలు ఇమిడిపోయారు. గతంలో పూర్తి మెజార్టీ రానందున భాగస్వామ్య పక్షాలన్నింటినీ కలిపి పనిచేయాల్సిన తరుణంలో వాజ్ పేయి తన అనుభవాన్ని రంగరించి సుపరిపాలన అందించారు. అయితే నేడు ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో బీజేపీ లోక్‌సభలో పూర్తి మెజార్టీ సాధించగా.. త్వరలో రాజ్యసభలో పూర్తి మెజార్టీ సాధించబోతోంది.
దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి అభ్యర్థికి న్యాయకోవిదుడు రామ్‌నాథ్ కోవింద్ వచ్చారు. న్యాయశాస్త్ర కోవిదుడిగా, బాల స్వయం సేవక్ సంఘ్‌గా ఆర్‌ఎస్‌ఎస్‌లో ఓనమాలు నేర్చుకున్న కోవింద్ ఇప్పుడు దేశ ప్రధమ పౌరుడు. నిష్కళంకుడిగా, దళితుల ఔన్నత్యం కోసం పనిచేసిన కోవింద్... న్యాయవాదిగా, రాజ్యసభ సభ్యుడిగా, గవర్నర్‌గా రాజ్యాంగ పరిరక్షణలో నేను సైతం అంటూ ముందుకు కదిలారు. అదే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌లో బాల స్వయం సేవక్ సంఘ్‌గా జీవితం ఆరంభించి, బీజేపీ కార్యకర్తగా, పార్టీ నాయకుడిగా, ప్రధాన కార్యదర్శిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా... ప్రధానిగా ఒకదాని తర్వాత మరో పదవిలోకి ఇమిడిపోయారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా మోదీ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి... నేడు దేశ అత్యున్నత పదవిని అధిరోహించారు. టీ అమ్మడం దగ్గర్నుంచి, స్వయం సేవక్ కార్యకర్తగా, బీజేపీ నేతగా దశాబ్దాలపాటు అకుంఠిత దీక్షతో పార్టీకి సేవలందించారు. పదేళ్ల యూపీఏ ఏలుబడిలో జరిగిన అవినీతిని పాతరేసేందుకు, ప్రధాని అభ్యర్థిగా రంగ ప్రవేశం చేసి నెంబర్ 1 పీఠాన్ని మోదీ దక్కించుకున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ బలోపేతం అవుతూ.. ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో కలిసి 17 రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకుంది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో ఒక పార్టీకి అత్యధిక సంఖ్యలో లోక్‌సభ స్థానాలుగానీ, అసెంబ్లీ స్థానాలను గానీ సంపాదించడంలో అటు మోదీ, అమిత్ షా కృషి మరువలేనిది. ఇక ఎమర్జెన్సీ రోజుల నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను చీల్చిచెండాడుతూ... జనసంఘ్ పార్టీలో కీలక సభ్యునిగా కొనసాగుతూ... ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా మరో బీజేపీ కీలక నేత వెంకయ్యనాయుడు చరిత్ర సృష్టించారు. అంత్య, ఆది ప్రాసలతో విపక్ష పార్టీలను చీల్చిచెండాడి.. ఒకే దేశం... ఒకటే సిద్ధాంతమంటూ వెంకయ్య దేశమంతా బీజేపీ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన పార్టీ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికై గెలుపొందారు. ఇక మరో కీలక నేత లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చారు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా లోక్‌సభకు 8 సార్లు ఎన్నికై ఆమె సంచలనం సృష్టించారు. సుమిత్రాతోపాటు లోక్‌సభకు 8 సార్లు ఎంపికైన ఎంపీలు ముగ్గురిలో ఆమె ఒకరు. మహిళా ఎంపీగా మహాజన్ ఒక్కరే ఇన్నిసార్లు విజయాలు సాధించడం విశేషం. వివాదాలకు తావివ్వకుండా తన పని తాను చేసుకుపోతూ... ముందుకు సాగే మహా జన్... రెండేళ్లపాటు మానవ వనరుల అభివృద్ధి మంత్రిగానూ పనిచేశారు.
ఎలాంటి రాజ కీయ కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహించని ఈ నలుగురు నేతలూ, స్వశక్తితో రాజకీయాల్లో ఎదిగి వచ్చి ఇప్పుడు దేశ ఔన్నత్యాన్ని కాపాడే విశిష్ట వ్యక్తులయ్యారు. కోవింద్, వెంకయ్య, మోదీ, సుమిత్రా మహాజన్ నలుగురిపైనా ఒక్కటంటే ఒక్క మచ్చ లేదు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ చిన్న అవినీతి, ఆశ్రితపక్షపాతమన్నది లేకుండా వారు రాజకీయ ప్రస్థానం సాగించారు. దేశంలో అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్ ఇలా నాలుగు రాజ్యాంగ పదవులను అలంకరిస్తున్న నలుగురు వ్యక్తులు బీజేపీలో కీలక సేవలందించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో ఓనమాలు దిద్దిన అనుభవం ఆ నలుగురిది. నలుగురు నేతలు విచారధార... సిద్ధాంతాన్ని పట్టుకొని ఈ స్థాయికి చేరుకున్నవారే. సిద్ధాంత రాజకీయాలకు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో నేర్చుకున్న క్రమశిక్షణతో పార్టీలో పనిచేశారు. నేడు ప్రభుత్వంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేశ స్వరూపాన్ని మార్చడానికి పిలుపిస్తున్న నరేంద్ర మోదీ కీలక పయనంగా ఈ పొందికను విశ్లేషించవచ్చు.
వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ
పురిఘళ్ల రఘురాం
ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com