సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించి నైతిక స్థైర్యాన్ని ఇనుమడింపచేసుకున్న కాంగ్రెస్ పార్టీకి రెండవ నైతిక విజయం ‘2జీ స్పెక్ట్రమ్’ స్కామ్ నుంచి విముక్తి పొందడం. ఈ స్కామ్ 2011లో దేశంలో, ముఖ్యంగా మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు నాంది పలికింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇదే నినాదాన్ని అందుకున్న భారతీయ జనతా పార్టీ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నరేంద్ర మోదీ అవకాశం దొరికినప్పుడల్లా అవినీతి అస్త్రాలను సంధించడం వల్ల ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసి కేవలం 44 సీట్లకే పరిమితం అయింది.
అప్పటి నుంచి వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోతూ కాంగ్రెస్ పార్టీ కోలుకోని దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో 2013లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాల్సిన రాహుల్ గాంధీ ముహూర్తం నాలుగేళ్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెలువడిన గుజరాత్ అసెంబ్లీ ఫలితాలను ఆయనకు, పార్టీకి ఊరటతోపాటు కొత్త స్ఫూర్తినిచ్చాయి. గతంలో 61 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ 77 సీట్లను సాధించి ఏకంగా 16 సీట్లను పెంచుకోగలిగింది. 16 సీట్లలో తృటిలో విజయాన్ని కోల్పోయి ఊరట పొందింది. ఇప్పుడు 2జీ స్కామ్ నుంచి విముక్తి పొందడం పార్టీ కార్యకర్తల్లో ఆనందోత్సవాలను నింపింది. కొత్త ఆశలను చిగురింప చేసింది.
‘లగ్తా హై హమారా అచ్చే దిన్ ఆరహీ హై’ 2జీ స్కామ్ తీర్పుపై స్పందిస్తూ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా వ్యాఖ్యానించారు. 2జీ స్కామ్‌ను అతిపెద్ద అవినీతి భూతంలా చూపించి భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందిందని, ఇప్పుడు అదే వారికి బూమరాంగయిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బీకే హరిప్రసాద్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment