
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఈసీకి సమర్పించిన అఫిడవిట్లను పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. ఈసారి కాంగ్రెస్ తరఫున ఎక్కువ మంది కోటీశ్వరులు బరిలో నిలవగా, నేర చరితులు ఎక్కువ మంది బీజేపీ తరఫున ఎన్నికల్లో నిలబడ్డారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) విశ్లేషణ ప్రకారం.. మొత్తం 338 మంది అభ్యర్థులు అఫిడవిట్లు సమర్పించారు.
ఇందులో అధికార కాంగ్రెస్ నుంచి 68 మంది బరిలో నిలవగా.. వీరిలో 59 మంది (87%) అభ్యర్థులు కోటీశ్వరులే. అలాగే బీజేపీ తరఫున పోటీలో నిలిచిన 68 మంది అభ్యర్థుల్లో 47 మంది (69%) కోట్లకు పడగలెత్తిన వారున్నారు. ఇక క్రిమినల్ రికార్డుల ప్రకారం.. బీజేపీ అభ్యర్థుల్లో 23 మంది (34%), కాంగ్రెస్ నుంచి ఆరుగురు (9%) నేరచరితులు పోటీలో నిలిచారు. చొపల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న బల్వీర్ సింగ్ వర్మ (బీజేపీ) రూ.90 కోట్ల ఆస్తులతో సంపన్న అభ్యర్థుల జాబితాలో మొదటి స్థానంలో నిలవగా, 84 కోట్లతో రెండోస్థానంలో విక్రమాదిత్యసింగ్ (కాంగ్రెస్) నిలిచారు.
వడ్డీలేని రుణాలు, ఉచిత ల్యాప్‌టాప్‌లు
సిమ్లా:హిమాచల్ ప్రదేశ్‌లో రైతులకు వడ్డీ లేని రుణాలు, కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఎన్నికల మేనిఫెస్టోను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ విడుదల చేశారు. రైతులకు వడ్డీలేని రుణాలిచ్చి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తామని, వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగులకు 1.50 లక్షల ప్రభుత్వోద్యాగాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో తెలిపారు.
పింఛను పథకాన్ని పునరుద్ధరించటంతో పాటు రెండేళ్లు దాటిన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీక రిస్తామన్నారు. దినసరి వేతన కూలీని రూ. 350 పెంచటంతో పాటు, సామాజిక భద్రత పింఛన్లు పెంచుతామన్నారు. యువ తకు స్వయం ఉపాధిలో భాగంగా ప్రైవేటు బస్సు పర్మిట్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్ షిండే కూడా పాల్గొన్నారు.

Comments
Please login to add a commentAdd a comment