కేబినెట్‌లోకి అజిత్‌ పవార్‌, ఆదిత్య ఠాక్రే! | Ajit Pawar And Aditya Thackeray May Got Place In Maharashtra Cabinet | Sakshi
Sakshi News home page

కేబినెట్‌లోకి అజిత్‌ పవార్‌, ఆదిత్య ఠాక్రే!

Published Mon, Dec 30 2019 11:17 AM | Last Updated on Mon, Dec 30 2019 11:57 AM

Ajit Pawar And Aditya Thackeray May Got Place In Maharashtra Cabinet - Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణపై కసరత్తు పూర్తయింది. ఈరోజు (సోమవారం) సాయంత్రంలోపు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శివసేన అధినేత ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్సీపీ ముఖ్యనేత అజిత్‌ పవార్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ కోరిన విషయం తెలిసిందే. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం ఠాక్రే.. అజిత్‌తో పాటు ఆదిత్యానూ కేబినెట్‌లోకి తీసుకుంటామని శరద్‌తో చెప్పినట్టు సమాచారం.

అజిత్‌కు మంత్రివర్గంలోకి తీసుకోవాలా వద్దా అనే దానిపై మూడు పార్టీల ముఖ్యనేతలు సుదీర్ఘంగా చర్చించారు. చివరికి శరద్‌ విజ్ఞప్తి మేరకు డిప్యూటీ సీఎం ఇచ్చేందుకు ఠాక్రే అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ఆయతో పాటు ఆదిత్య మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. కానీ వీరిద్దరి స్థానంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు డిప్యూటీ సీఎం పదవి కోసం ఎన్సీపీ సీనియర్‌ నేత జయంత్‌ పాటిల్‌ తీవ్రంగా ‍పోటీపడుతున్నారు. పదవి ఎలాగైనా తనకే వచ్చేలా తన మద్దతు దారులతో మంతనాలు జరుపుతున్నారు. దీంతో అజిత్‌, పాటిల్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నా.. చివరికి పవార్‌నే వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (తండ్రి ప్రభుత్వంలో కుమారుడికి చోటెక్కడ?)

మొత్తం 42 మందికి అవకాశం ఉండటంతో శివసేన నుంచి 13 మందిని, ఎన్సీపీ నుంచి 13 మందిని, కాంగ్రెస్‌కు చెందిన 10 మందిని మంత్రివర్గంలో చేర్చుకోనున్నారు. శివసేన, ఎన్సీపీలకు 10 కేబినెట్, 3 సహాయ మంత్రి పదవులు ..కాంగ్రెస్‌ నుంచి 8 మంది కేబినెట్, ఇద్దరు సహాయ మంత్రులు కానున్నారు. కాగా సీఎంతో పాటు ఇదివరకే ఆరుగురు మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement