
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నికల్లో తప్పుడు ఆఫిడవిట్ సమర్పించారని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ఈ మేరకు బలరాంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై మంగళవారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బలరాం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారు. బలరాంకు నలుగురు పిల్లలైతే ఆఫిడవిట్‌లో ముగ్గురని పేర్కొన్నారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశామ’ని తెలిపారు.
బలరాం నాలుగో సంతానంకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలను, కొన్ని పత్రాలను ఆయన మీడియాకు చూపించారు. తనను చెల్లిగా భావించి న్యాయం చేయాలని ఆ అమ్మాయి(బలరాం కూతురు) తనను ఆడిగినట్టు ఆమంచి పేర్కొన్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాబట్టే కోర్టులో పిటిషన్ వేసినట్టు స్పష్టం చేశారు.