
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఘాటుగా విమర్శలు చేశారు. అవినీతికి పాల్పడటంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రికార్డులను అధిగమించిందని ధ్వజమెత్తారు. గురువారం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ గ్రౌండ్స్‌లో ‘నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్ర’ను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వం అత్యధికంగా అవినీతికి పాల్పడినట్లు ఓ సర్వేలో వెల్లడైందని చెప్పారు.
ప్రస్తుతం చేపట్టిన పరివర్తన యాత్ర సిద్ధ రామయ్యను గద్దె దించేందుకు పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ యాత్రలో కీలకపాత్ర పోషించిన బీజేపీ రాష్ట్ర చీఫ్ బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అవుతారన్నారు. రాష్ట్రానికి కేంద్రం విడుదల చేస్తున్న నిధులు ప్రజలకు చేరడం లేదన్నారు. మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను నవంబర్ 10న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండటాన్ని ఆయన తప్పు బట్టారు. ఇదంతా ఓటు బ్యాంకు కోసమేనని విమర్శించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం కన్నడ రాజ్యోత్సవ్‌ను నిర్వహించడం కంటే టిప్పు జయంతిని నిర్వహించేందుకు ప్రభుత్వం ఎక్కువగా ఆసక్తి చూపుతోందని అన్నారు. రాష్ట్రంలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్రను 75 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా నిర్వహించే సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment