'చంద్రబాబు చరిత్ర హీనులవడం ఖాయం' | Amjad Basha Comments About Pinnelli Ramakrishna Reddy Assassination Attempt | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు చరిత్ర హీనులవడం ఖాయం'

Published Tue, Jan 7 2020 4:55 PM | Last Updated on Tue, Jan 7 2020 6:46 PM

Amjad Basha Comments About Pinnelli Ramakrishna Reddy Assassination Attempt - Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ గూండాలు హత్యాయత్నంకు పాల్పడిన ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు చూశారని డిప్యూటీ సీఎం అంజద్ బాషా వెల్లడించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ దుర్మార్గాన్ని ప్రోత్సహించడం దారుణమని పేర్కొన్నారు.రైతుల రూపంలో టీడీపీ గూండాలను ప్రేరేపించి ఒక ప్రజాప్రతినిధిపై హత్యాయత్నంకు పాల్పడడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఇటువంటి చర్యలపై ప్రజలే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వుంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు మాత్రమే ఇచ్చి చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఆయన బుద్ధి మారలేదని విమర్శించారు.

చంద్రబాబు అప్పటి నుంచి మరింత దిగజారి ఇలాంటి సిగ్గుమాలిన పనులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ రోజు దేశంలో నెంబర్ వన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ చంద్రబాబేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనే దుష్ర్పచారంతో చంద్రబాబు ముందుకు వెడుతున్నారన్నారు. ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆయన గన్ మెన్లపై కూడా దాడులు చేయడం, అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా జరిగిన సంఘటనను వక్రీకరించి చూపుతున్నారని అంజద్‌ బాషా వెల్లడించారు. అసెంబ్లీకి, సెక్రటేరియట్ కు ఎవరూ రాలేని పరిస్థితిని చంద్రబాబు సృష్టించారు. అమరావతి ప్రాంతంలో లెజిస్లేచర్ క్యాపిటల్ ఉండకూడదనే చంద్రబాబు ఇలాంటి కుట్రలను చేస్తున్నారని విమర్శించారు.( ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం)

ఒకప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు కూడా చంద్రబాబుకు ఆవేశం రాలేదని, ఈ రోజు మాత్రం మూడు రాజధానులు అంటే ఎందుకు అంత ఆవేశం వస్తుందని ప్రశ్నించారు. చంద్రబాబు ఆవేశం వెనుక ఆయన బినామీలకు చెందిన భూముల విలువలు తగ్గిపోతున్నాయనే బాధ తప్ప వేరేవి పట్టించుకోరని ఎద్దేవా చేశారు. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొందన్నారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీలను  చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బీసీజీ నివేదికను వివరించిన అధికారుల తీరును తప్పుబట్టిన చంద్రబాబు ప్రస్తుతం ఏ రకమైన బాషను మాట్లాడుతున్నారనేది ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని అంజద్‌ వెల్లడించారు. దళిత ఐఎఎస్ అధికారి పట్ల చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారని, ఈ వ్యవహారంపై దళిత సంఘాలు చంద్రబాబును ఛీ కొడుతున్నారని పేర్కొన్నారు. మూడు రాజధానులు వద్దు... అమరావతి ముద్దు అని విజయవాడలో బెబుతున్న చంద్రబాబు ఇదే మాటను రాయలసీమ, ఉత్తరాంధ్రకు వెళ్లి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపి ప్రజలకు భ్రమలు కల్పించారని తెలిపారు. 

అమరావతిని నిర్మించాలంటే రూ. 1.10 లక్షల కోట్లు కావాలని చెప్పారు. ప్రస్తుతం అంత డబ్బు ఖర్చు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని, ఆయన చెప్పిన విషయాలను పరిగణలోకి చూస్తే బయటి నుంచి అప్పులు తేవాలన్నారు. అందుకు ప్రతిఏటా వేల కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వుంటుందని, ఇవన్నీ సాధ్యపడుతాయా అంటూ ప్రశ్నించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చామని అంజద్‌ పేర్కొన్నారు.  రాజధాని కోసమే రైతులు చనిపోతున్నారంటూ చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని, ఏ కారణంతో చనిపోయినా రాజధాని కోసమే అంటూ దుష్ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి, సమన్యాయం కోసమే తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు చరిత్ర హీనులుగా నిలవడం ఖాయమని దుయ్యబట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement