సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా పెండింగ్ ప్రాజెక్టులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామని 2014 జూలైలో అప్పటి సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. చెప్పిన మొత్తం కంటే ఐదేళ్లలో అదనంగా రూ.16 వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ, ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు’ అంటూ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ తూర్పారబట్టారు. పోలవరం ప్రాజెక్టులో ఒక్క గేటు అమర్చే డ్రామాకే చంద్రబాబు రూ.2.30 కోట్ల ఖర్చుతో ప్రకటన ఇచ్చారని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తవ్వుతున్న కొద్దీ చంద్రబాబు అవినీతి, అక్రమాలు, సినిమాలు, వీడియోలు, యాడ్‌లు బయట పడుతున్నాయన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అవినీతి నిగ్గు తేల్చడానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. నిపుణుల కమిటీ, మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. అంచనా వ్యయాన్ని పెంచేసి చేపట్టిన పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి ప్రజాధనాన్ని ఆదా చేస్తామని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ పనుల్లో పారదర్శకత కోసం జ్యుడీషియల్ కమిషన్ నేతృత్వంలో టెండర్లు నిర్వహించాలనే విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్న ఏకైక సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని, ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని చెప్పారు. శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమాధానం చెప్పారు. హంద్రీ–నీవా రెండో దశలో రెండో ప్యాకేజీలో రూ.10.43 కోట్ల విలువైన పని వ్యయాన్ని రూ.92 కోట్లకు పెంచేసి కమీషన్లు కాంట్రాక్టర్‌కు అప్పగించారని ఎత్తిచూపారు.
రూ.5 కోట్ల పనికి రూ.137 కోట్లా?
గాలేరు–నగరి తొలి దశలో 29వ ప్యాకేజీలో రూ.171 కోట్లకుగాను రూ.166 కోట్ల పని 2014 నాటికే పూర్తయిందని.. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక మిగిలిన రూ.5 కోట్ల విలువైన పనిని 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్ నుంచి విడదీసి దాని వ్యయాన్ని రూ.137 కోట్లకు పెంచి, రాజ్యసభ సభ్యుడి సంస్థకు అప్పగించి ప్రజాధనాన్ని దోచుకున్నారని మంత్రి అనిల్‌కుమార్ మండిపడ్డారు. టీడీపీ సర్కార్ హయాంలో మొత్తం 268 పనులను 60సీ నిబంధన కింద విడదీస్తే ఇందులో రూ.1,600 కోట్ల విలువైన పనులను రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు నామినేషన్ పద్ధతిలో, టెండర్ నిబంధనలు మార్చి అప్పగించారని ఎత్తి చూపారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై నిపుణుల కమిటీ విచారణ చేస్తోందని.. ఆ తర్వాత గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, వంశధార తదితర ప్రాజెక్టుల అవినీతిని నిగ్గు తేల్చుతుందని స్పష్టం చేశారు.
జీవో 22, 63 వల్లే పెరిగిన అంచనాలు
టీడీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. జీవో 22, జీవో 63 వల్లే అంచనాలు పెరిగాయి తప్ప భూసేకరణ వల్ల కాదన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ పనుల్లో రూ.6 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ తేల్చినా కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.68 వేల కోట్లు ఖర్చు చేస్తే.. రూ.60 వేల కోట్లను చంద్రబాబు సర్కార్ దోచేసిందని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. కుందురు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీళ్లు ఇచ్చి ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని కోరారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లోనే రూ.2,346 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు పచ్చ పత్రిక కథనం ప్రచురించిందన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిని తేల్చడానికి హౌస్ కమిటీ వేయాలని కోరారు.
తవ్వేకొద్దీ అక్రమాలే
Published Thu, Jul 18 2019 4:43 AM | Last Updated on Thu, Jul 18 2019 4:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment