సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యంత కీలక అంశాల విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రదర్శిస్తున్న చులకన భావం, వారు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదాతో పాటు విభజన బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో కీలకమైనవేవీ ఇప్పటివరకు నెరవేరకపోగా, కడప ఉక్కు కర్మాగారం, విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు వంటి వాటి విషయంపై టీడీపీ ఎంపీల నైజం తేటతెల్లం చేసే వీడియో బయటకుపొక్కడంతో ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రత్యేకించి కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో ఢిల్లీ వేదికగా ఆందోళన చేయాలన్న అంశంపై టీడీపీ ఎంపీలు సమావేశమైన సందర్భంగా ఒక్కక్కరు తేలిక భావంతో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో లీక్ కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవాక్కయ్యారు. అలాంటి వీడియో లీక్ కావడంపై ఆయన ఆగ్రహం ప్రదర్శించారు. ఎంపీలు చాటుమాటుగా మాట్లాడుకున్న సంభాషణలకు సంబంధించిన వీడియో ఎవరు చిత్రీకరించారు? ఎలా బయటకు పొక్కింది? అన్న విషయాలపై విచారణ చేయించాలని నిర్ణయించారు.
టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, జేసీ దివాకర్ రెడ్డి, మురళీమోహన్, కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, అవంతి శ్రీనివాస్ తదితరులు గురువారం ఢిల్లీలోని ఏపీభవన్ లో సమావేశమయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కడప ఉక్కు కర్మాగారం కోసం ఏదో పోరాటం చేసినట్టు బిల్డప్ ఇవ్వడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయానికొచ్చారు. ఆ క్రమంలో వారంతా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశంపై చాలా తేలికగా, చులకన భావంతో స్పందించారు. పార్టీ అధినేత చెప్పినట్టుగానే తమ వంతుగా నిరాహార దీక్ష చేయడంపై సమాలోచనలు జరిపారు. ఈ క్రమంలోనే ‘‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’’ అంటూ ఒక్కో ఎంపీ ఒక్కో రకంగా తమలోని ఆలోచనలు బయటపెట్టారు. అంతా సరదాగా సమావేశాన్ని ఎంజాయి చేశారు. అయితే తమ నిజస్వరూపం బయటపెట్టేలా వీడియో రికార్డవుతుందని వారు ఊహించలేకపోయారు. వారు మాట్లాడిన మాటల వీడియో మీడియాలో దర్శనమీయడంతో పార్టీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
తమ నాటకాలు ఢిల్లీ వేదికగా బహిర్గతం కావడం పట్ల పార్టీ అధినేత చంద్రబాబు నివ్వెరపోయారు. ఇదే అంశంపై పార్టీ ఎంపీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అలా వీడియో తీస్తుండగా గమనించకుండా ఎలా ఉన్నారు? ఇంతకు ఆ వీడియో తీసిందెవరు? అంటూ వారిపై ఆగ్రహం ప్రదర్శించారు. తమ వ్యాఖ్యలను తప్పుడుగా ప్రచారమయ్యాయని కొందరు ఎంపీలు ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ వీడియో రికార్డింగ్ ఎవరు చేశారో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ఇలాంటివి బయటకు పొక్కడం వల్ల పార్టీ పరువు పోతుందంటూ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాటలకు వక్రీకరించారని మురళీమోహన్, అవంతి శ్రీనివాస్ ఏదో చెబుతుండగా, ఇకనుంచి బాధ్యతగా వ్యవహరించాలని సూచించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇలాంటివి బయటకు రావడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పారు.
సంబంధిత కథనం :
Comments
Please login to add a commentAdd a comment