
సాక్షి, పశ్చిమ గోదావరి : తెలంగాణ ఎన్నికల సభలో సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు అమ్మలాగా హామీ ఇచ్చిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాకు తొలిసంతకం ఏపీకి వరమన్నారు. ప్రజాస్వామ్య శక్తులు ఏకమై బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి మేలు చేయాలనుకునే వారు కాంగ్రెస్‌తో రానున్నారని, రాష్ట్రానికి కీడు చేయాలనుకునేవారు బీజేపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిసి వెళ్తారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏపీలో 100 అసెంబ్లీ స్థానాల్లో ఢీ కొనే స్థాయిలో సిద్దంగా ఉందని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు ఒంటరిగా పోరాటం చేయవని, జాతీయ పార్టీతోనే కలిసి వెళ్తాయన్నారు. బూత్ కమిటీ ఏర్పాటు, ఇంటింటా కాంగ్రెస్, శక్తి ప్రాజెక్ట్ అంశాలపై పార్టీ శ్రేణులతో సమీక్షించామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోని ఇంటింటా కాంగ్రెస్‌లో ప్రజల వద్దకు తీసుకెళ్తున్నామని తెలిపారు.