న్యూఢిల్లీ : జాతిపితను హతమార్చిన నాథూరామ్ గాడ్సే నిజమైన ఉగ్రవాది అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరామ్ గాడ్సే అంటూ మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం అసదుద్దీన్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ హంతకుడిని గొప్పవాడిగా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. హిందూ ఉగ్రవాదం గురించి నోరెత్తని వారు మహాత్మా గాంధీని చంపింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. తద్వారా నాథూరామ్ గాడ్సే గురించి కమల్ వెలిబుచ్చిన అభిప్రాయానికి ఆయన మద్దతునిచ్చారు.
కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అరవక్కురిచ్చిలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో కమల్ హాసన్ మాట్లాడుతూ..‘ ‘గాంధీ విగ్రహం ముందు నిలబడి ఒకటి చెబుతున్నా..దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే. మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేతోనే ఉగ్రవాదం ఆరంభమైంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నారని ఈ మాట చెప్పడం లేదు. ఎక్కడైనా ఇదే మాట చెబుతా’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందూ సంఘాలు, బీజేపీ నేతలు కమల్ వ్యాఖ్యలపై మండిపడుతుండగా, కాంగ్రెస్ నేతలు కమల్‌కు అండగా నిలుస్తున్నారు. ఇక విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్న కమల్‌పై చర్యలు తీసుకోవాలంటూ పలువురు బీజేపీ నేతలు ఈసీని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment