సాక్షి, హైదరాబాద్ : ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన స్వామి పరిపూర్ణానందను పోలీసులు గృహనిర్బంధం చేసిన నేపథ్యంలో జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హిందూత్వవాదులు, ఆయన అనుచరులు పెద్దసంఖ్యలో ఇంటివద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్వామి పరిపూర్ణనంద ఇంటి వద్ద ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పెట్రోల్ డబ్బాతో వచ్చిన అతను.. స్వామిజీ మద్దతుగా ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్ చేశాడు. అతను ఒంటిపై పెట్రోల్ పోసుకుంటుండగా అడ్డుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
బీజేపీ ఖండన
శ్రీరాముడిపై కత్తిమహేష్ వ్యాఖ్యలకు నిరసనగా ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన స్వామి పరిపూర్ణానందను గృహనిర్బంధం చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపూర్ణానంద హౌజ్ అరెస్టును ఆయన ఖండించారు. స్వామీజీలను అరెస్టు చేయడం మంచిది కాదని తెలంగాణ ప్రభుత్వానికి లక్ష్మణ్ హితవు పలికారు. పరిపూర్ణానందను వెంటనే గృహనిర్బంధం నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేయడం, నిరసనలు ప్రదర్శించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఈ హక్కును ప్రభుత్వాలు కాలరాయకూడదని ఆయన పేర్కొన్నారు.
హిందూ సంస్థల ఆందోళన
స్వామి పరిపూర్ణానంద హౌజ్ అరెస్టును వ్యతిరేకిస్తూ తిరుమల అలిపిరి వద్ద హిందూ దేవాలయాల పరిరక్షణ సేవాసంస్థ నిరసన ప్రదర్శన చేపట్టింది. గోవింద నామస్మరణతో సంస్థ ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేపట్టగా.. విజిలెన్స్ అధికారులు వారిని అడ్డుకున్నారు.
చదవండి :
Comments
Please login to add a commentAdd a comment