
గునా (మధ్యప్రదేశ్) : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతుల దేశభక్తిని ప్రశ్నిస్తూ తమ పార్టీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్యా చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. కోహ్లి దేశభక్తిని ప్రశ్నించాల్సిన అవసరం శాక్యాకు లేదని తేల్చిచెప్పింది. ఇప్పటికైనా సదరు ఎమ్మెల్యే తీరు మార్చుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చింది. ' విరాట్ కోహ్లి-అనుష్క శర్మ దేశభక్తిని ప్రశ్నించాల్సిన అవసరం ఆ ఎమ్మెల్యేకు లేదు. నచ్చినచోట పెళ్లిచేసుకొనే అవకాశం వారికి ఉంది. బీజేపీ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఆ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకోవాలి' అని మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత ఎస్ ప్రకాశ్ తెలిపారు. బీజేపీ ప్రతిష్ట దెబ్బతినే వ్యాఖ్యలు ఇకముందు చేయొద్దని పన్నాలాల్‌ను ఆయన హెచ్చరించారు.
కోహ్లి, అనుష్క ఇటలీలో పెళ్లి చేసుకోవడంపై బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్యా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'ఇండియాలో విపరీతమైన పేరు ప్రఖ్యాతలు, డబ్బులు సంపాదించి.. వాటిని ఇటలీలో ఖర్చుపెట్టిన విరాట్-అనుష్కలకు అసలు దేశభక్తి ఉందా? ఈ దేశంలోనే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విక్రమాదిత్యుడు, ధర్మరాజు లాంటి పురాణ పురుషులు పెండ్లిళ్లు చేసుకున్నారు. మనందరం కూడా ఇక్కడే పెండ్లిళ్లు చేసుకున్నాం.. ఇకపైనా చేసుకుంటాం. మనలో ఎవరైనా విదేశాలకు వెళ్లి పెండ్లిళ్లు చేసుకున్నామా? మరి కోహ్లి మాత్రం ఆ పని ఎందుకు చేసినట్లు? ఇక్కడ (ఇండియాలో) సంపాదించిన డబ్బును విదేశాల్లో ఖర్చుచేయడమేంటి?’ అని పన్నాలాల్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో ఆయన తీరుపై బీజేపీ ఘాటుగా స్పందించింది.
విరాట్-అనుష్కల పెండ్లి డిసెంబర్ 11న ఇటలీలోని ప్రఖ్యాత టస్కనీ నగరానికి సమీపంలో.. 800 ఏళ్ల నాటి గ్రామంలో ఉన్న బోర్గో ఫినోచీటీ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్న విరుష్కలు.. సన్నిహితుల కోసం డిసెంబర్ 21న ఢిల్లీలో, 26న ముంబైలో రిసెప్షన్ ఇవ్వనున్నారు.