
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌లోని కొంతమంది బందిపోటు దొంగలు ఆర్టీసీ ఆస్తులను కొల్లగొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడాలని గవర్నర్ తమిళిసైను కోరినట్లు తెలిపారు. బుధవారం రాజ్‌భవన్‌లో లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మె మొదలై 12 రోజులు గడిచినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని వ్యాఖ్యానించారు. మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గులాబీ కండువాలే ఆర్టీసీని దోచుకుంటున్నాయని, దసరాకు 22 రోజులు సెలవులచ్చి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు. శాంతియుతంగా, ప్రజాస్వామికంగా ప్రభుత్వ మెడలు వంచుతామని పేర్కొన్నారు. తమది దొంగల ముఠా కాదని, రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చినా వాళ్ల వెంట బీజేపీ ఉంటుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment