సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలు అవినీతికి, అభివృద్ధికి మధ్యేనని..రెండోసారి ప్రధానిగా మోదీనే గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేవైఎం నేతలకు జాతీయ నేతలు పిలుపునిచ్చారు. దేశాన్ని అగ్రపథాన నిలిపే సత్తా ఒక్క మోదీకే ఉందని, అందుకే ఆయన సారథ్యాన్ని మరోసారి తీసుకురావాల్సిన బాధ్యత యువమోర్చాదేనన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్ ఆధ్వర్యంలో విజయ లక్ష్య–2019 యువ మహాధివేçశన్ సభ ఘనంగా జరిగింది.
ఈ సభకు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, ఎంపీ అనురాగ్ ఠాకూర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లతో పాటు దేశవ్యాప్తంగా బీజేవైఎం కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ..వ్యక్తుల కోసం కాకుండా సిద్ధాంతాల కోసం నడిచే పార్టీ ఒక్క బీజేపీనే అన్నారు. జనసంఘ్ ఆవిర్భావం నుంచి జనతా పార్టీ ఏర్పడిన విధానాన్ని ఆయన గుర్తు చేశారు. అప్పటి ప్రధాని ఇందిరా పాలనలో ఎమర్జెన్సీ విధింపు, జయప్రకాశ్ నారాయణ, వాజ్‌పేయి, అద్వానీ, మొరార్జీ దేశాయ్ వంటి నాయకులు ఇందిరను నిలువరించిన తీరును స్మరించుకున్నారు.
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కన్నా 6 ఏళ్లు పాలించిన వాజ్‌పేయి పాలనలో విప్లవాత్మక అభివృద్ధి జరిగిందన్నారు. ఇపుడు మోదీ నాలుగున్నరేళ్ల పాలనలో దేశం అన్నిరంగాల్లో దూసుకుపోతోందన్నారు. రోడ్లు, పోర్టులు, రైలు మార్గాలు, మౌలికసదుపాయాల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, సైన్స్ ఆవిష్కరణలు, సమీకృత అభివృద్ధి లక్ష్యంగా రాత్రి, పగలు తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
మోదీ పాలనకు బ్రహ్మరథం: ఫడ్నవిస్
నాలుగున్నరేళ్ల మోదీ పాలనకు దేశం బ్రహ్మర థం పడుతోందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్న విస్ పేర్కొన్నారు. అబ్దుల్ కలామ్ కలగన్న 2020 నాటికి భారత్ అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందన్నారు. కశ్మీర్ ను పూర్తిగా భారత్‌లో కలపకుండా సగం పాకిస్తాన్‌కు ఇచ్చిన కాంగ్రెస్ నిత్యం అక్కడ అశాంతికి కారణమైం దన్నారు. మోదీని మరోసారి ప్రధానిని చేయాలని ఆయన చేస్తోన్న పనులను యువతకు వివరించాల్సిన ఆవశ్యకత బీజేవైఎందేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఆరోపణలు సిగ్గుచేటు: జేపీ నడ్డా
మోదీని ప్రపంచదేశాలు ప్రపంచనేతగా గుర్తిస్తున్నాయని అలాంటి నేతపై కాంగ్రెస్ ఆరోపణలు చేయడం సిగ్గు చేటని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. మోదీని విమర్శించిన ప్రతీ సారి కాంగ్రెస్ ఓటుశాతం పడిపోతుందన్న విషయం ఆ పార్టీ గుర్తించలేదన్నారు. 2014కు ముందు దేశరాజకీయా ల్లో పూర్తి నైరాశ్యం ఆవరించిందని, అలాంటి పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిన మోదీ దేశాభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు.
మోదీ వల్లే పెట్రోలు ధరలు తగ్గాయి: ధర్మేంద్ర ప్రధాన్
ప్రస్తుతం దేశంలో పెట్రోఉత్పత్తుల ధరలపై చర్చ నడుస్తోందని, వాస్తవానికి ఈ ధరల పెరుగుదల ప్రపంచ మార్కెట్లపై ఆధారపడి ఉంటుందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మోదీ అంతర్జాతీయ సంబంధాల కారణంగానే తొమ్మిది రోజులనుంచి ధరలు దిగివస్తున్నాయని వెల్లడించారు. దేశంలో సోలార్, బయో ఇంధన వనరులను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
సోషల్‌మీడియా బాధ్యతలు మీవే: అనురాగ్ ఠాకూర్
గత ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో సోషల్ మీడియా కీలకపాత్ర పోషించిందని, ఈ సారి కూడా ఆ బాధ్యతలు బీజేవైఎం నేతలవేనని ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి అనేక విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని, పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేవైఎందేనని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment