
కోల్‌కతా : ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘జై శ్రీ రాం’ వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ గొడవ సద్దుమణగక ముందే.. దీన్ని మరింత పెద్దది చేసే కార్యక్రమాన్ని ముందేసుకున్నారు ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ ఒకరు. నైనిటాల్ - ఉధమ్‌సింగ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన అజయ్ భట్ మమతా బెనర్జీని ఎద్దుతో పోల్చారు. ‘జై శ్రీ రాం’ నినాదం వివాదంపై అజయ్ భట్ స్పందిస్తూ.. ‘ఎవరైనా మమతా బెనర్జీ ముందు ‘జై శ్రీ రాం’ అంటే చాలు ఆమెకు ఎక్కడా లేని కోపం వస్తుంది. ఎర్ర రంగును చూసి ఎద్దు ఎలా రంకెలేస్తుందో.. జై శ్రీ రాం నినాదం వినిపిస్తే మమత కూడా అలానే ప్రవర్తిస్తుందం’టూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ప్రజాస్వామ్య దేశంలో జనాలకు తమకు నచ్చిన నినాదాలు చేస్తారని పేర్కొన్నారు.
అంతేకాక ‘ఉత్తరాదిన ఎవరైన ఇద్దరు పరిచయస్తులు ఎదురుపడగానే ‘జై శ్రీ రాం’ అని పలకరించుకుంటారు. ఇది హలో చెప్పుకోవడం వంటిదే. అలాంటిది జై శ్రీ రాం అని పలకరించుకుంటే దీదీకి ఎందుకంత కోసం వస్తుందో జనాలకు కూడా తెలియడం లేదు. ఒక వేళ శ్రీరాముడంటే మమతకు పడదేమో’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై టీఎంసీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.